
అమృత రెండోసారి గర్భం దాల్చింది. సమన్వి ఆడుకోవడానికి త్వరలోనే ఓ బుజ్జి పాపాయి వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో..
కన్నడ నటి అమృతా నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల కూతురు సమన్విని కోల్పోయింది. అమృతానాయుడు, రూపేశ్‌నాయుడు దంపతులు కనకపురరోడ్డులోని లిబర్టీ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె సమన్వి(6) రియాలిటీ షోలో పోటీదారుగా ఉంది. గురువారం సాయంత్రం తల్లి అమృతనాయుడు, సమన్విలు వాజరహళ్లిలో షాపింగ్‌కు స్కూటీలో వెళ్లి వస్తుండగా వెనుక నుంచి టిప్పర్ ఢీకొంది.
కిందపడిన సమన్విపై లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి దింది. అమృతానాయుడుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారస్వామి లేఔట్ ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం అమృత నాలుగు నెలల గర్భిణీ. బనశంకరి స్మశానవాటికలో శుక్రవారం సమన్వి అంత్యక్రియలు జరిగాయి. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మంచేగౌడను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ విభాగ ట్రాఫిక్ డీఎస్పీ కుల్‌దీప్ కుమార్ జైన్ తెలిపారు.
ఇదిలా ఉంటే అమృతా నాయుడు, సమన్వి ఇద్దరూ 'నన్నమ్మ సూపర్ స్టార్' అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. కానీ అమృత రెండోసారి గర్భం దాల్చిన తర్వాత ఫిజికల్ టాస్కులు ఆడటం కొంత కష్టమవుతుండటంతో ఆ షో నుంచి తప్పుకున్నారు. సమన్వి ఆడుకోవడానికి త్వరలోనే ఓ బుజ్జి పాపాయి వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో తన కూతురు చనిపోవడంతో పుట్టెడు శోకంలో మునిగింది అమృత. లిటిల్ స్టార్ సమన్వి మరణంపై పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. 'ఇంత చిన్నపాపను తీసుకెళ్లడానికి ఆ దేవుడికి మనసెలా వచ్చింది? అసలు భగవంతుడున్నాడా? చిన్నారి సమన్విని నేను చాలా మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక' అంటూ కన్నడ యాంకర్ సృజన్ నివాళులు అర్పించాడు.