బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. 2022లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ సినిమాలో అనన్య గ్లామర్ డోస్ పెంచినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ మూవీ తర్వాత మళ్లీ తెలుగు సినిమా వైపు ఆమె చూడలేదు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె తండ్రి చంకీ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. లైగర్ చిత్రంలో నటించడం అనన్యకు ఎంత్ర మాత్రం ఇష్టం లేదని ఆయన కామెంట్స్ చేశారు. కేవలం తను చెప్పడం వల్లే లైగర్ ప్రాజెక్ట్‌లో ఆమె భాగమైందని గుర్తు చేసుకున్నారు.
లైగర్ సినిమా హిందీలో కూడా విడుదల చేస్తుండటంతో హీరోయిన్ ఎవరైతే బాగుంటుందని చిత్ర యూనిట్ సర్చ్ చేస్తున్నప్పుడు అనన్య పాండే మంచి ఛాయిస్ అనుకున్నారని ఆమె తండ్రి గుర్తుచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ వచ్చినప్పుడు తన కూతురు అనన్య చాలా అసౌకర్యంగా ఫీలైందని చంకీ పాండే పేర్కొన్నారు. లైగర్‌లో హీరోయిన్ పాత్రకు ఎంత మాత్రం సెట్ కానంటూ అనన్య కాస్త గందరగోళానికి గురైందని ఆయన తెలిపారు. స్క్రీన్‌పై మరీ చిన్న పిల్లలా కనిపిస్తానేమో అనే సందేహాన్ని అనన్య వ్యక్తం చేసినట్లు చంకీ పాండే అన్నారు.
'నాన్నా.. లైగర్ సినిమాలో నేను సెట్ కానేమో అనుకుంటున్నా.. ఏం చేద్దామో చెప్పండి' అంటూ నా దగ్గరకు వచ్చింది. ఎలాంటి కన్‌ఫ్యూజన్ వద్దు. పాన్ ఇండియా రేంజ్‌లో చాలా పెద్ద ప్రాజెక్ట్‌లో ఛాన్స్ వచ్చింది. సినిమా విజయం సాధిస్తే.. భవిష్యత్‌లో మంచి పేరు వస్తుందని చెప్పాను. దీంతో ఆమె ఓకే చెప్పింది. అయితే, సినిమా విడుదుల తర్వాత వచ్చిన రివ్యూలు చూసి నా నిర్ణయం తప్పు అనిపించింది. తను చెప్పినట్లుగానే స్క్రీన్‌పై చాలా యంగ్‌గా కనిపించింది. ఈ సినిమా తర్వాత ఎప్పుడూ కూడా తనకు ఎలాంటి సలహాలు ఇవ్వలేదు' అని చంకీ పాండే అన్నారు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పాండే.. తొలి చిత్రంతోనే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి క్రేజ్ ఉన్న సమయంలోనే లైగర్‌లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె కూడా పలు వ్యాఖ్యలు చేసింది. లైగర్ సినిమా చేయడానికి ఇద్దరే కారణమని ఆమె చెప్పింది. నిర్మాత కరణ్‌జోహార్‌తో పాటు తన తల్లిదండ్రులు చెప్పడం వల్లే 'లైగర్'లో నటించానని ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ మూవీ బెడిసికొట్టడంతో తనకు ఎలాంటి సలహాలు, సూచనలు భవిష్యత్‌లో ఇవ్వద్దని అదే వేదిక మీద తన తండ్రితో చెప్పింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment