‘‘సుమ పంచాయితీ పెడుతుందని కాదు.. పిలిచిందని ప్రేమతో వచ్చాను (నవ్వుతూ). సుమ ప్రతిభను దర్శకులు, టెక్నిషియన్స్ పది శాతం వినియోగించుకున్నా చాలు ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. సుమకు ఆల్ ది బెస్ట్’’ అన్నారు హీరో నాగార్జున. ప్రముఖ యాంకర్ సుమ కనకాల టైటిల్ రోల్‌లో దినేష్ కుమార్, షాలినీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో బలగ ప్రకాశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున, నాని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నటుడు రాజీవ్ కనకాల (సుమ భర్త) బిగ్ టికెట్ అందుకున్నారు.
నాని మాట్లాడుతూ.. ‘‘సుమగారికి నేను పెద్ద అభిమానిని. ఇండస్ట్రీలో పెద్దలు, ప్రభుత్వాలు, అసోసియేషన్స్ సినిమాకు ఏం చేశాయో నాకు తెలియదు కానీ సుమగారు మాత్రం తెలుగు సినిమాకు చాలా చేశారు. ప్రతి సినిమాకు సుమగారు పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. ‘జయమ్మ పంచాయితీ’ ట్రైలర్ చూశాను. సుమగారు బాగా చేశారు’’ అన్నారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూసి సుమగారికి ఆడియన్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందమైన ఆడవాళ్లను చూశాను. తెలివితేటలున్న ఆడవాళ్లను చూశాను. మంచి మనసున్న ఆడవారిని చూశాను. ఈ మూడూ సుమలో ఉన్నాయి’’ అన్నారు.
సుమ మాట్లాడుతూ – ‘‘టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లిన ఓ బుడ్డి సుమ.. టీవీకి వచ్చి, సినిమాకు కూడా రావడం అనేది నిజంగా అదృష్టం. ఆడియన్స్ ప్రోత్సాహంతోనే నాకు ఎనర్జీ వస్తుంది. అందరి హీరోల ఫ్యాన్స్ మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. విజయం సాధించిన ప్రతి మగాడి వెనక ఓ మహిళ ఉందంటారు. కానీ విజయం సాధించిన ప్రతి మహిళ వెనక ఓ కుటుంబం ఉంటుంది. మీరందరూ (ప్రేక్షకులను ఉద్దేశించి) నా ఫ్యామిలీ’’ అన్నారు. ‘‘సుమగారు మంచి ప్రతిభావంతురాలు. ఓ రెండు షాట్స్‌లో తప్పులు కనిపెట్టి, వాటిని మ్యూజిక్‌తో ఎలివేట్ చేద్దామన్న కీరవాణిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు విజయ్ కుమార్.
‘‘నేను సిక్కోలు బిడ్డను. సుమగారు లేకపోతే ‘జయమ్మ పంచాయితీ’ లేదు. కీరవాణిగారు మా సినిమాకు సంగీతం అందిస్తా అన్నప్పుడే మా సినిమా విజయం సాధించినట్లు భావించాను. సక్సెస్ మీట్‌లో మరింత మాట్లాడతాను’’ అన్నారు నిర్మాత బలగ ప్రకాశ్. ఓ సినిమా సాంగ్ షూట్‌లో ఉన్నందువల్ల దర్శకులు రాఘవేంద్రరావు, వెకేషన్‌లో ఉన్నందువల్ల రాజమౌళి ఈ వేడుకకు రాలేకపోతున్నట్లుగా వీడియో సందేశాలు పంపారు. చిత్రయూనిట్‌కి దర్శకులిద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్, గాయకుడు రేవంత్, డీవోపీ అనుష్‌కుమార్, ఆర్ట్ డైరెక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: ఒకే రోజు ముచ్చటగా 3 సినిమాలు.. దేనికి ఆడియెన్స్ ఓటు !
Comments
Please login to add a commentAdd a comment