సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన సినిమా "కళ్యాణం కమనీయం". నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల.
► నేను పుట్టి పెరిగింది గుంటూరులో. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండేది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి ప్రయత్నాలు ప్రారంభించాను. వారాహి సంస్థలో తుంగభద్ర చిత్రానికి పనిచేశాను. ఈ లైన్ అనుకున్న తర్వాత నా స్నేహితుడు అజయ్ కుమార్ రాజు ద్వారా యూవీ క్రియేషన్స్ లో పరిచయం ఏర్పడింది. అలా ఈ సినిమాకు అవకాశం దక్కింది.
► యూవీ లాంటి పెద్ద సంస్థలో తొలి చిత్రానికి దర్శకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. సంక్రాంతికి స్టార్స్ సినిమాలు విడుదలవుతున్నాయి. అయినా మా కంటెంట్ మీద నమ్మకం ఉంది. సినిమా చూసిన సెన్సార్ వారు కూడా మీరు క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు.
► పెళ్లైన తర్వాత మన జీవితాల్లో జరిగే ప్రతి సందర్భం కొత్తదే. అలా ఓ యువ జంట తమ వైవాహిక జీవితం ప్రారంభమయ్యాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఏం నేర్చుకున్నారు? మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఎలా సరిదిద్దుకున్నారు? అనేది అన్ని ఎమోషన్స్‌తో సినిమాలో చూస్తారు. మన సొసైటీలో అమ్మాయి ఫీలింగ్స్‌ను మా కథ ప్రతిబింబిస్తుంది.
► నా దృష్టిలో సినిమా అంటే మనల్ని మనం పోల్చుకోవాలి. "కళ్యాణం కమనీయం" అలా రిలేటబుల్ మూవీ. నా జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలు కూడా కథకు స్ఫూర్తినిచ్చాయి. అలా ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సందర్భాలు ఎదురుకావొచ్చు.
► దర్శకుడిగా నాకు ఫేవరేట్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఎమోషన్ చూపించాలంటే మణిరత్నం, ఒక హైలోకి తీసుకెళ్లాలంటే రాజమౌళి, సొసైటీకి మంచి చెప్పే చిత్రాల విషయంలో శంకర్, యాక్షన్ అంటే బోయపాటి ఇలా చాలా మంది అభిమాన దర్శకులు ఉన్నారు. నాకు రొమాంటిక్ కామెడీతో పాటు యాక్షన్ జానర్ ఇష్టం. త్వరలో నా కొత్త సినిమా వివరాలు చెబుతాను.
Comments
Please login to add a commentAdd a comment