వెండితెర కళాతపస్వి కె విశ్వనాథ్ అంత్యక్రియలు శుక్రవారం(ఫిబ్రవరి 3న) మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశాన వాటికలో ముగిశాయి. ఫిలిం నగర్ నుంచి పంజాగుట్ట వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి ఆయన ఘన నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘దర్శక దిగ్గజంగా ఎదిగిన కె. విశ్వనాథ్ తన మొదటి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకున్నారు. 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. నటనతో కూడా అందరిని మెప్పించే పాత్రలు చేసి సినీ ప్రేక్షక హృదయాల్లో చిరస్మరణీయడుగా నిలిచారు.
ఆయన రూపొందించిన శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం వంటి సినిమాలతో దేశ సినిచరిత్రలో కె.విశ్వనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు, రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ వంటి అత్యున్నతమైన అవార్డులను కె.విశ్వనాథ్ అందుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను కోల్పోవడం తెలుగు సినీ రంగానికి తీరని లోటు’ అని మంత్రి పేర్కొన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment