Avatar 2 Trailer Along With Doctor Strange In The Multiverse Of Madness: 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ సినిమా. ఒక సరికొత్త ఊహా లోకంలో విహరించేలా చేసింది. ఈ సినిమాలో పండోరా ప్రపంచంలో హీరో అక్కడ ఉన్న గుర్రాలను మచ్చిక చేసుకోవడం తన తోకను గుర్రం మైండ్‌తో మమేకం చేసి, హీరో ఆలోచనలకు తగ్గట్టుగా గుర్రం నడుచుకునే సన్నివేశాల ఆడియెన్స్‌ను ఆశ్చర్యపరిచాయి. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అవతార్ 2' రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏదో సాధారణంగా అన్ని సినిమాల్లాగా 'అవతార్ 2' ట్రైలర్‌ను విడుదల చేస్తే కిక్ ఏముంటుంది. అందుకే మరొ భారీ చిత్రంతో 'అవతార్ 2' ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారట. ఆ సినిమా ఏంటంటే.. మార్వెల్ సంస్థలోని 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్'. ఈ సినిమాను మే 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన థియెటర్లలోనే 'అవతార్ 2' మొదటి ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. 'అవతార్ 2' సినిమాను ఎలాంటి వాయిదాలు లేకుండా ఈ ఏడాదిలోపు విడుదల చేస్తామని '20న సెంచరీ స్టూడియోస్ ప్రెసిడెంట్' స్టీవ్ అస్బెల్ ఇటీవల తెలిపారు. 'నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. జిమ్ చేస్తున్న దాన్ని మీరు ఊహించలేరు.' అని ఓ హాలీవుడ్ రిపోర్టర్‌తో పేర్కొన్నారు.
ఇక 'డాక్టర్ స్ట్రేంజ్ 2' విషయానికొస్తే ఇటీవల 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' సినిమాలో మల్టీవర్స్ యాంగిల్‌ను చూపించారు. ఇప్పుడు రాబోతున్న 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' సినిమాలో 'ఎక్స్ మెన్' సిరీస్ సూపర్ హీరోలు వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ ట్రైలర్‌లో సినిమాలోని ప్రొఫెసర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ అతిథిగా కనిపించినట్లు చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల్లో ఎక్స్ మెన్ హీరోస్ కూడా వస్తారని వార్తలు వినిపించాయి. అవతార్ 2 లాంటి విజువల్ వండర్ ట్రైలర్‌ను డాక్టర్ స్ట్రేంజ్ 2తో ప్రదర్శిస్తే చూస్ అభిమానులకు కనులవిందే. కాగా మార్వెల్ సంస్థలోని మరో భారీ చిత్రం 'థోర్: లవ్ అండ్ థండర్' జులైలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment