ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన బలగం మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం అందుకున్న ఈ మూవీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు కొల్లగొడుతుంది. ఈ మూవీ డైరెక్టర్ ఓ హాస్యనటుడు కావడం విశేషం. వెండితెర, బుల్లితెరపై కమెడియన్‌గా అలరించిన వేణు యెల్డండిలీ చిత్రంతో దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. తెలంగాణ సంస్కృతి, ప్రజల అనుబంధాల కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
కేవలం మౌత్ టాక్‌తోనే బలగం మంచి వసూళ్లు చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ఒక సినిమా మంచి విజయం సాధించాలన్న, ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే భారీ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదని, కథ ఉంటే చాలని మరోసారి బలగం నిరూపించింది. కేవలం రూ. 2 కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ. 25 కోట్లపైనే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాదు ఈ మూవీ వరుసగా అవార్డులను అందుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ డైరెక్టర్ వేణు తొలిప్రయత్నంలోనే ఉత్తమ దర్శకుడిగా అంతర్జాతీయ అవార్డును సాధించాడు.
ఉత్తమ దర్శకుడిగా వేణు ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డుకు అందుకున్నాడు. కాగా ఇప్పటికే బలగం లాస్ ఏంజెలెస్ సినిమాటోగ్రఫీ నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఒనికో ఫిల్మ్ అవార్డ్స్ నుంచి బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. డీసీ ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్ లో ఏకంగా నాలుగు అవార్డులు అందుకున్న ఈ మూవీకి మరో ఇంటర్నేషనల్ అవార్డు దక్కడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment