టాస్కులు బాగా ఆడితే పంపించేస్తారనే విషయం బయటకు వస్తే కానీ తెలీలేదంటున్నాడు కుమార్ సాయి. బిగ్‌బాస్ షో ప్రారంభమైన మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతడు అందరికీ చేరువ కాలేకపోయాడు. అప్పటికే బంధాలు, స్నేహాలు ఏర్పరుచుకున్న మిగతా ఇంటి సభ్యులు కుమార్‌ను ప్రత్యేకంగా చూశారు తప్ప తమలో ఒకరిగా కలుపుకుపోలేదు. పైగా అతడే ఎవరితో కలవట్లేదని చెప్తూ వీలైనన్ని సార్లు నామినేట్ చేశారు. చివరాఖరికి ఏకాకిగా షో నుంచి బయటకు వచ్చేశాడు. తాజాగా కుమార్ సాయి బిగ్‌బాస్ షో గురించి, ఇతర కంటెస్టెంట్ల గురించి, ఎలిమినేషన్ గురించి మనసులోని మాటను బయటపెట్టాడు. ఆయన ఏమన్నాడో అతని మాటల్లోనే..
బయటకు వచ్చాక మొదలైంది అసలు బాధ
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినందుకు బాధగానే ఉంది. కానీ బయట పరిస్థితులు ఏంటో నాకు తెలీదు, కాబట్టి పెద్దగా బాధపడలేదు. ఆట వరకు మనం ఆడతాం. ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది, సంతోషంగానే బయటకు వచ్చాను, కానీ ఆ తర్వాత అసలు బాధ మొదలైంది. మేమంతా ఓట్లు వేశాం నువ్వు ఎలా ఎలిమినేట్ అయ్యావ్ అంటుంటే బాధేస్తోంది. (చదవండి: టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?)
అఖిల్ కష్టపడుతున్నాడు, కానీ..
ఎందుకూ పనికి రానిది కరివేపాకు అని నాగార్జున చెప్పారు. కానీ అఖిల్‌ను అంత మాట అనాలనిపించలేదు. కరివేపాకు అనేది కూరలో వేసినప్పుడు ఫ్లేవర్ రావడం లేదని చెప్పాను. టాస్కుల్లో చాలా కష్టపడుతున్నాడు కానీ ఫెయిల్ అవుతున్నాడు. అఖిల్ టాస్కుకు వెళ్తున్నాడు అంటే ఓడిపోతాడు అని కొందరు వెనక మాట్లాడుకుంటున్నారు. అది చెప్పడానికి చాలా ట్రై చేశాను. చెప్పాను, కానీ అతడు పెద్దగా పట్టించుకోలేదు. నీ ఎఫర్ట్‌ను తీసిపారేయకుండా కరివేపాకులా నమిలి తినేయాలి, ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో చెప్పాను. కానీ నెగెటివ్‌గా తీసుకున్నాడు. నువ్ సరిగా ఆడినా అక్కడ ఉన్నావు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాడు. పెద్దగా ఫీల్ అవలేదు. ఎందుకంటే నేనిక కంటెస్టెంటు కాదు కాబట్టి ఏం మాట్లాడలేదు. (చదవండి: అభిజిత్ సారీ చెప్పాలి, లేదంటే..: కుమార్)
నామినేషన్స్‌లో ఒరిజినాలిటీ బయటపడుతుంది
ఫైనల్‌గా ఎలాంటి రిలేషన్స్ పెట్టుకున్నా ఒంటరిగానే ఆడాలి. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకులే, అని నేను సింగిల్‌గా ఆడాను. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం నాకు మైనస్ అయింది. అక్కడికి వెళ్లేసరికే వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్‌తో సెట్ అయిపోయారు. నన్ను కలుపుకోలేదు. మనుషులు అయితే అలా చేయరు. కొన్ని జంతువులు అలా చేస్తాయి. వీళ్లు అలా చేశారు అనడం లేదు కానీ నన్ను అయితే దూరంగా ఉంచారు. బిగ్‌బాస్ హౌస్‌లో చాలా కష్టమైన పని నామినేట్ చేయడం . అప్పటివరకు క్లోజ్‌గా ఉన్న వ్యక్తిని నామినేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అయితే హౌస్‌మేట్స్ వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్‌ను నామినేట్ చేయకుండా నన్ను చేశారు.
వ్యక్తిత్వానికి కప్పు రావాలని వెళ్లాను
డాన్స్ చేయాలి, నటించాలి.. అంటే టాస్క్ వరకు చేస్తాను. కానీ 24 గంటలు నటిస్తూనే ఉండాలి, నవ్విస్తూనే ఉండాలి అంటే నాకు నచ్చలేదు. నేను కమెడియన్ అని లోపలికి వెళ్లి జోకులు వేస్తే నాకంటూ వ్యక్తిత్వం ఉండదు. నా వ్యక్తిత్వానికి కప్పు రావాలని బిగ్‌బాస్‌కు వెళ్లాను తప్ప నా పర్ఫామెన్స్‌కు రావాలని కాదు. నేను షో నుంచి ఎలిమినేట్ అయినా ఆ స్టేజ్ ద్వారా నాగార్జున గారు నా కథ వినడానికి ఓకే చెప్పడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఆయనకు కథ వినిపిస్తా అని కుమార్ సాయి చెప్పుకొచ్చాడు. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత)
Comments
Please login to add a commentAdd a comment