ఆటలు, పాటలు.. అడ్డంకులు, ఆటుపోట్లు.. ఇలా ఎన్నింటినో దాటుకుని బిగ్‌బాస్ ఫైనల్ వీక్‌కు ఐదుగురు మాత్రమే చేరుకున్నారు. ఇంటిని, బయటి ప్రపంచాన్ని వదిలేసి బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులుగా ఉంటున్నారు. వీరి జర్నీ తుది అంకానికి చేరుకున్న సందర్భంగా ఫైనలిస్టుల కష్టాలను, ఆనందాలను గుర్తు చేస్తూ బిగ్‌బాస్ జర్నీ వీడియోలు ప్లాన్ చేశాడు. ఆ విశేషాలు నేటి (డిసెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
తన్మయత్వంలో గౌతమ్
బిగ్‌బాస్ హౌస్‌లో గడిచిన ప్రయాణాన్ని గుర్తు చేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ ఏర్పాటు చేశాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్ల ఫోటోలు, టాస్క్ ప్రాపర్టీస్.. ఇలా అన్నింటినీ అందంగా అమర్చాడు. మొదటగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫోటోలు చూసుకుని, ఆడిన టాస్కుల్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.
అదే మీ స్ట్రాటజీ
తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. బలవంతుడితో ఎలాగోలా గెలవొచ్చు. కానీ మొండివాడితో గెలవలేము. మీ మొండితనంలో నిజాయితీ ఉంది. మునుపటిసారి ఇంట్లో వచ్చినప్పుడు జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని పర్ఫెక్ట్ ప్లేయర్‌గా మిమ్మల్ని మీరు మల్చుకోవడానికి చేసిన కృషి ప్రశంసనీయం. లక్ష్యాన్ని చేధించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీ స్ట్రాటజీ ఏంటో మిగతావారికి అర్థం కాకపోవడమే మీ స్ట్రాటజీగా మార్చుకున్నారు. ఊహించని విధంగా వారిపై దాడి చేశారు.
ఒక యోధుడిలా..
స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ మాటలో, ఆటలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఎలిమినేషన్ అంచులవరకు వెళ్లినప్పుడు మీ మనసు చెలించింది. మీ ప్రణాళికను మార్చేసుకుని బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదులుతూ ఏ ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగింది. మీరు కోరుకున్న (యష్మి దగ్గర) ప్రేమ మీకు లభించకపోయినా అది మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు.
అమ్మ మాట వినే...
గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. అది నెరవేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరం. ఈ రెండూ కనబర్చిన మీ ప్రయాణాన్ని ఓసారి చూసేద్దాం అంటూ పొగడ్తల అనంతరం జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసిన గౌతమ్.. బిగ్‌బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్. 'నీ లైఫ్‌లో ఎవరూ నీ కోసం ఏదీ చేయరు, ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు' అని అమ్మ చెప్పింది.
ఆ గౌరవం కోసమే వచ్చా
తను చెప్పింది వినే ఇక్కడిదాకా వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకెప్పుడూ గౌరవం లభించలేదు. దానికోసమే ఈ సీజన్‌కు వచ్చాను. గౌరవం సంపాదించుకున్నాను. జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్‌బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత అవినాష్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు బిగ్‌బాస్. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది.
జస్ట్ కమెడియన్ కాదు
ఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా? నవ్వుకున్న బలం అలాంటిది! ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులైనా అందరూ మీ ఆప్తులే.. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే! రింగుల జుట్టు మీ భార్యకు ఇష్టమైనప్పటికీ ఆటకోసం త్యాగం చేశారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమెడియన్ అన్నా, మీ కామెడీ వారికి రుచించలేదని నిందించినా మీరు కుంగిపోలేదు. కమెడియన్ అనే బిరుదును గర్వంగా ధరించి ధీటుగా జవాబిచ్చారు.
ఎవరికీ తక్కువ కాదు
ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు, అన్నీ చేయగలిగే కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ఆవిష్కరించుకున్నారు. మిమ్మల్ని వేలెత్తి చూపినవారు కూడా ఈ విషయం ఒప్పుకోక తప్పదు. రెండుసార్లు మెగా చీఫ్‌గా, అందరికంటే ముందు ఫైనలిస్టుగా నిలిచి.. ఆటలో, మాటలో, పోటీలో ఎవరికీ తక్కువ కాదని తెలిసేలా చేశారు అంటూ జర్నీ వీడియో చూపించాడు.
మనిషిగా నేను గెలిచా
అది చూసి భావోద్వేగానికి లోనైన అవినాష్.. నాకు గొడవపెట్టుకోవడం రాదు. మనసున్న మనిషిగా నేను గెలిచాను బిగ్‌బాస్. బాగా ఆడే నా ఫ్రెండ్ రోహిణి ఓడిపోతుంటే నాతోపాటు ముందుకెళ్లాలని ఆలోచించాను. కమెడియన్స్ ఎందుకు గెలవకూడదు? అని బిగ్‌బాస్ నాలుగో సీజన్ నుంచి నాలో మెదులుతున్న ప్రశ్న. కానీ జనాలు అనుకుంటే ఏదైనా అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మిగతావారి జర్నీలు రేపటి ఎపిసోడ్‌లో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment