
నేను మరీ అంత చెడ్డోడిని కాదంటూనే తన సైకోయిజాన్ని చూపిస్తున్నాడు బిగ్‌బాస్. కెరటం టీమ్(నిఖిల్, మణికంఠ) ఆకలేస్తుందని అర్ధరాత్రి దొంగల్లా దోసెలు తిన్నందుకు అందరినీ నిద్రలేపి మరీ క్లాసు పీకాడు. ఇంకోసారి ఇలా ఫుడ్ తింటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. మరోవైపు లూజర్ అని సోనియాతో మాటలు పడ్డ నిఖిల్ తన సత్తా చూపించాడు. ఓడిపోయేవాళ్లంటేనే గిట్టదన్న సోనియా ఒక్క గేమ్‌లో కూడా గెలవలేదు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..

ప్రైజ్‌మనీ పెంచుకునే ఛాన్స్
ఈ సీజన్‌లో అంతులేనంత డబ్బు ప్రైజ్‌మనీగా సంపాదించుకునే అవకాశం కల్పించాడు బిగ్‌బాస్. తాను ఇచ్చే ఛాలెంజ్‌లలో మూడు టీమ్స్ పాల్గొని డబ్బు సంపాదించుకోవాలన్నాడు. ఏ టీమ్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది ప్రైజ్‌మనీలో యాడ్ అవుతుందన్నాడు. మొదటి ఛాలెంజ్‌లో మణి, విష్ణుప్రియ, సోనియాను స్విమ్మింగ్ పూల్‌లో దూకాలన్నాడు. సోనియా మధ్యలోనే కిందపడిపోగా మణికంఠను పృథ్వీ ముందుకు వెళ్లనీయకుండా గట్టిగా పట్టేసుకోవడంతో అతడు వెనకబడిపోయాడు. విష్ణు మొదటగా దూకేసి తన అంతులేని వీరుల టీమ్ ఖాతాలో రూ.25 వేలు పడేలా చేసింది.

ఎగిసిపడ్డ కెరటం
బిగ్‌బాస్.. రెండో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. ఈ కలర్ బాల్స్ గేమ్‌లో పృథ్వీ, నబీల్, నిఖిల్ హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ గెలవడంతో కెరటం టీమ్ ఖాతాలో అర లక్ష పడింది. మూడో ఛాలెంజ్ విలువను రూ.70 వేలుగా ప్రకటించాడు. ఈ స్పెల్లింగ్ గేమ్‌లో యష్మి, మణికంఠ, నైనిక పాల్గొన్నారు. ఇందులో ఎక్కువ పదాలు కరెక్ట్‌గా రాసిన మణికంఠ కెరటం టీమ్ ఖాతాలో రూ.70 వేలు పడేలా చేశాడు.

ఆకలితో అలమటించిన నిఖిల్
రేషన్ లేకపోవడంతో కేవలం రాగిజావతో సరిపెట్టుకుంటున్న మణి, నిఖిల్ అర్ధరాత్రి ఆకలేసింది. దీంతో దొంగచాటుగా పక్క టీమ్ చేసుకున్న దోశలు ఆరగించారు. ఇది చూసిన బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ అందర్నీ నిద్రలో నుంచి లేపి మరీ వార్నింగ్ ఇచ్చాడు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని గుర్తుచేశాడు. ఇంట్లో ఫుడ్ దొంగతనం మొదలుపెట్టిన యష్మికి.. తమ పాలప్యాకెట్ అవతలివారు ఎత్తుకుపోయేసరికి ఉక్రోశం పట్టలేకపోయింది. విష్ణుప్రియతో గొడవకు దిగింది.

దబాయించిన యష్మి
మా చికెన్ దొంగిలించలేదా? అని విష్ణు ఎదురుతిరిగితే.. నీ దగ్గర సాక్ష్యం ఉందా? అని దబాయించింది. ఎందుకు అరుస్తున్నావంటే నేనిలాగే అరుస్తానని యష్మి తెగేసి చెప్పింది. నాలుగో ఛాలెంజ్ విలువ ఏకంగా రూ.1,50,000గా ప్రకటించాడు. ఈ గేమ్‌లో అభయ్, ఆదిత్య, నిఖిల్ పోటీపడ్డారు. ఆదిత్య ఓడిపోగా.. అభయ్(అఖండ టీమ్), నిఖిల్(కెరటం టీమ్) గెలిచి చెరో రూ.75 వేలు గెలుచుకున్నారు. ఐదో ఛాలెంజ్ విలువను రూ.50 వేలుగా ప్రకటించాడు. నిఖిల్, నబీల్, పృథ్వీ వ్యాక్స్ చేయించుకోవాలన్నాడు.

కాళ్లు మొక్కిన విష్ణుప్రియ
అయితే ఆ నొప్పి భరించలేక తన వల్లకాదని పృథ్వీ మధ్యలోనే చేతులెత్తేశాడు. సోనియా.. నబీల్ (అంతులేని వీరులు టీమ్)ను విజేతగా ప్రకటించడంతో ఆనందం పట్టలేకపోయిన విష్ణుప్రియ ఏకంగా ఆమె కాళ్లకు నమస్కరించింది. ఆరో ఛాలెంజ్ విలువ బిగ్‌బాస్ రూ.1 లక్షగా ప్రకటించాడు. చివరి బజర్ వరకు కాళ్లకు సాక్స్ ఉండేలా చూసుకోవాలన్నాడు. ఈ గేమ్‌లో విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నబీల్, అభయ్, పృథ్వీ పాల్గొన్నారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో సంచాలకురాలు ప్రేరణ అందరిమీద గరమైంది. ఈ తోసుకోవడాలు, కొట్టుకోవడాలు ఆపండని అరిచింది.

బిగ్‌బాస్ నుంచే వెళ్లిపోతా..
పాపం, తన మాటల్ని ఎవరూ లెక్క చేయలేదు. పృథ్వీ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయింది. అయితే అభయ్ నెట్టడం వల్లే తాను కిందపడ్డానని విష్ణుప్రియ, అది నిజమైతే బిగ్‌బాస్ హౌస్ నుంచే వెళ్లిపోతానని అభయ్ వాదించాడు. కాసేపటికి విష్ణుప్రియను మళ్లీ ఆడించినా చివరికి అవుట్ అయింది. అనంతరం నబీల్‌ను కూడా ఎలిమినేట్ చేయడంతో అతడు గరమయ్యాడు. చివర్లో నిఖిల్, అభయ్‌కు టై అయినట్లు ప్రకటించడంతో ఇరు టీమ్స్‌కు చెరి రూ.50 వేలు లభించాయి. ఫైనల్‌గా రూ.2,45,000తో కెరటం టీమ్ లీడ్‌లో ఉంది.

Comments
Please login to add a commentAdd a comment