Bigg Boss Gangavva Initiative For Bus Service To Lambadipally: యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్‌బాస్ హౌజ్ నుంచి నిష్కమించిన గంగవ్వ.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర చిత్రాల్లో నటించి అలరించింది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది.
గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్‌బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు.
చదవండి: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ
లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో 'మై విలేజ్ షో' టీం నటులు అనిల్, అంజి మామ తదితరులు ఉన్నారు.
చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు..
Comments
Please login to add a commentAdd a comment