
Bigg Boss Telugu 5, Ravi New Captain!: బుల్లితెర మీద హీరో అయిన యాంకర్ రవి బిగ్‌బాస్ హౌస్‌లో హీరో కాలేకపోతున్నాడు. బోలెడంత పాపులారిటీ, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మొదట్లో ఆడవాళ్ల గొడవల్లో ఇరుక్కుని, మాటలు మార్చుతూ, అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పుతూ జాతీయ ఛానల్‌లో తన పరువు తానే తీసుకున్నాడు. ఇలా చాలాసార్లు అబద్ధం చెప్తూ అడ్డంగా దొరికిపోయిన రవిపై హౌస్‌మేట్స్ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు.
తాజాగా హౌస్‌లో జరిగిన బీబీ హోటల్ టాస్క్‌లో హోటల్ సిబ్బంది సేవలను చెడగొట్టాలని రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందుకోసం అతడు కావాలని సన్నీ బెడ్ మీద నీళ్లు పోయడం, కాజల్ డబ్బులు దొంగిలించడం, కాజల్ వాటర్ బాటిల్‌లో కారం కలపడం వంటి పనులు చేశాడు. అయితే ఇవన్నీ రవియే చేశాడని అందరూ అనుమానపడ్డారు. పైగా అతడికి పైసా టిప్పు ఇవ్వద్దని ఓ నిర్ణయానికి వచ్చారు, కానీ ఈ మాట మీద ఎవరూ నిలబడలేదు అది వేరే విషయం.
సీక్రెట్ టాస్క్ అంటేనే ఎవరికీ అనుమానం రాకుండా అప్పగించిన పనిని పూర్తి చేయడం. కానీ ఇక్కడ అందరికీ రవి సీక్రెట్ టాస్క్ చేస్తున్నాడని తెలిసిపోయింది. అయినప్పటికీ అతడు కెప్టెన్సీ పోటీదారుడిగా సెలక్ట్ అవడం, తర్వాతి గేమ్‌లో కెప్టెన్ అవడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. ఏదేమైనా ప్రతివారం నామినేషన్‌లో ఉంటున్న రవి ఎట్టకేలకు కెప్టెన్ అయి ఇమ్యూనిటీ సాధించాడు. దీంతో వచ్చేవారం రవి నామినేషన్ టెన్షన్ లేకుండా హాయిగా గుండెల మీద చేతులేసి నిద్రపోవచ్చు.