
బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొన్న యూట్యూబ్ స్టార్ సిరి హన్మంత్ ఈ మధ్య అనేక విమర్శలు ఎదుర్కొంటోంది. తను నవ్వినా, ఏడ్చినా, ఏం చేసినా.. అది ఫేక్ అని, డ్రామా చేస్తోందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను ఏకిపడేస్తున్నారు. తన గేమ్ తను ఆడకుండా షణ్ముఖ్‌తో కలిసి జెస్సీని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందని విమర్శిస్తున్నారు. సన్నీని ఫ్రెండంటూనే ప్రతిసారి అతడికి వెన్నుపోటు పొడుస్తుందని తిట్టిపోస్తున్నారు. ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్కులోనూ సన్నీకి సపోర్ట్ చేయాలనుందంటూనే అతడు కెప్టెన్ అవ్వకుండా కత్తితో పొడిచింది. అంతే కాకుండా ఇక్కడితో మన మధ్య దూరం తగ్గిపోవాలని, తిరిగి మళ్లీ ఫ్రెండ్స్ అయిపోవాలని సన్నీతో చెప్పుకొచ్చింది. కానీ కెప్టెన్ కాకూడదని కత్తితో పొడిచిన విషయాన్ని లైట్ తీసుకోలేనని ముఖం మీదే చెప్పేశాడు సన్నీ.
అయితే అతడితో తన ఫ్రెండ్‌షిప్‌ను ఎలాగైనా పునర్నిర్మించుకోవాలని చూస్తోంది సిరి. ఈ క్రమంలో కిచెన్‌లో వేడిగిన్నెను పట్టుకుని చేయి కాల్చుకున్న సన్నీ దగ్గరకు వెళ్లింది. వేళ్లు అంటుకున్నాయా? అంటూ అతడిమీద ఎక్కడలేని ప్రేమను కురిపించింది. గిన్నె సుర్రుమనగానే వదిలేశా, కాబట్టి పెద్దగా ఏమీ అవలేదు అని కంగారుపడొద్దన్నాడు సన్నీ. అతడికి పెద్దగా గాయంలాంటివి ఏవీ అవలేదని అర్థమైన సిరి 'జాగ్రత్త' అని చెప్తూ ముందుకెళ్లిపోయింది. కానీ అంతలోనే మళ్లీ ఆగి సన్నీని పట్టుకుని ఏడ్చేసింది. దీంతో అతడు ఆమెను బుజ్జగించాడు. తర్వాత కన్నీళ్లను తుడిచేసుకుని ఏమీ జరగనట్టు హౌస్‌లోపలకు వెళ్లిపోయింది సిరి. అయితే అన్‌సీన్ వీడియోలో ఈ సీన్ చూసిన నెటిజన్లు ఇది కూడా డ్రామా అని, తను చేసిన తప్పును కవర్ చేసుకోవడానికే ఇలా నాటకాలు ఆడుతోందని, తనది ఫేక్ ఫ్రెండ్‌షిప్ అని కామెంట్లు చేస్తున్నారు.