అనగనగనగా ఓ పెద్ద మనిషి.. గేమ్ ఫెయిర్‌గా ఆడటం చేతకాదు.. కానీ పక్కవాళ్ల ఆటకు మాత్రం వంకలు పెడుతుంటాడు. ఎవరైనా కోపంతో అరిస్తే గడ్డిపోచలా తీసిపడేస్తాడు. తాను మాత్రం అందరి మీదా అరుస్తుంటాడు. అవతలివారికి నీతులు చెప్తుంటాడు, కానీ ఒక్కసారైనా పాటించే పాపాన పోలేదు. అందరి ముందు ఇతరుల్ని మెచ్చుకుంటాడు.. గెలిస్తే చప్పట్లు కొడతాడు.. కానీ వెనకాల మాత్రం వాళ్ల గురించి చెడుగా మాట్లాడుతూ గోతులు తీస్తాడు.
ఓటమిని సహించలేడు
అనరాని మాటలని, సూటిపోటి మాటలతో వేధించి ఎదుటి వ్యక్తి కుంగిపోయేలా చేస్తాడు.. కానీ వాళ్లు ఏడిస్తే మాత్రం వెళ్లి ఓదార్చినట్లు నటిస్తూ అందరి దృష్టిలో మంచివాడైపోయేందుకు ప్రయత్నిస్తాడు. జోకుల ముసుగులో లోపల ఉన్న పగ, ద్వేషాన్నంతా కక్కుతాడు. అలా ఎందుకన్నావని అడిగితే ఏదో సరదాగా అన్నాను, అందులో ఏ ఉద్దేశమూ లేదని నక్కవినయం ప్రదర్శిస్తాడు. ఓటమిని అస్సలు తీసుకోలేడు.. ఎదుటివారిని తొక్కేయాలని పన్నాగాలు పన్నుతాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే అతడి గురించి పెద్ద చాటభారతమే అవుతుంది. ఇంత చెప్పాక ఆ పెద్ద మనిషి ఎవరో మీకీపాటికే అర్థమయ్యి ఉంటుంది. శివాజీ.. ఈయన ఎన్ని తప్పులు చేసినా బిగ్‌బాస్ టీం వెనకేసుకొస్తూనే ఉంది.
దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు
దీనికి తోడు నాగార్జున సైతం అతడు ఆడకపోయినా చాణక్యుడిగా వర్ణిస్తూ ఆకాశానికెత్తేశాడు. అప్పుడప్పుడు.. అక్కడ పొరపాటు చేశావ్, వాళ్లను కొడతానన్నావ్, వీళ్లను తిట్టావు అని ధైర్యం కూడదీసుకుని అడిగినా.. ఛఛ.. దేవుడి మీద ఒట్టు.. వాళ్లంతా నా బిడ్డలు.. నేనేదో సరదాగా అన్నాను అని ఎక్కడలేని వినయం, విధేయత పులుముకుని, ఒక వెకిలి నవ్వు నవ్వేస్తాడు. దీన్ని హోస్ట్, ఇతర కంటెస్టెంట్లు గుడ్డిగా నమ్మేస్తారు. తానేం చెప్పినా నడుస్తోంది, తనను ఆపేవాళ్లే లేరని శివాజీ రెచ్చిపోతూనే ఉన్నాడు.
బూతులపై నాగ్ ప్రశ్నలు..
మరీ ముఖ్యంగా అమర్‌ను పనికిమాలినోడా.. పిచ్చి పోహా.. వేస్ట్ ఫెలో.. జీరో.. ఇలా ఎన్నో మాటలన్నాడు. ఇన్నాళ్లకు నాగ్ ఈ బూతులేంటి? అని ప్రశ్నించాడు. ఈ విషయంలో నీ అనుభవం? సహనం, సమర్థత ఏమైంది? అని అడిగాడు. ఈమేరకు ప్రోమో రిలీజైంది. కానీ శివాజీ ఎప్పటిలాగే అది సరదాగా అన్నానే తప్ప కావాలని అనలేదని అరిగిపోయిన టేప్ రికార్డర్‌లా మళ్లీ చెప్పిందే చెప్పడం ఖాయం. మరి ఈసారైనా బూతుల విషయంలో శివాజీకి నాగ్ వార్నింగ్ ఇస్తాడా? లేదంటే ఎప్పటిలాగే లైట్ తీసుకుంటాడా? చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment