ఇంతకి డ్రగ్స్‌ ఎందుకు వాడతారు..? | Bollywood Drugs Special Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ఏ ‘వుడ్‌’ అయితేనేం, ఇప్పుడన్నీ ‘నార్కోవుడ్‌’గానే..

Published Sun, Sep 27 2020 7:27 AM | Last Updated on Sun, Sep 27 2020 11:31 AM

Bollywood Drugs Special Story In Sakshi Funday

హాలీవుడ్‌ సంగతి సరే, మన దేశంలో చూసుకుంటే తొలుత డ్రగ్స్‌ కలకలం బాలీవుడ్‌లో మొదలైంది. క్రమంగా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లకూ విస్తరించింది. ఏ ‘వుడ్‌’ అయితేనేం, ఇప్పుడన్నీ ‘నార్కోవుడ్‌’గానే మారుతున్నాయనే విమర్శలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు పట్టుబడిన సందర్భాల్లో మీడియాలో వార్తల హోరు జోరుగా ఉంటోంది గాని, సినీరంగంతో నిమిత్తంలేని వారిలో సైతం చాలామంది డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నారు.

ఇటీవల బాలీవుడ్‌ హీరో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య సంఘటన తర్వాత భారతీయ సినీరంగంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం మొదలైంది. డ్రగ్స్‌కు సంబంధించి సెలబ్రిటీల పేర్లు వార్తలకెక్కుతున్నాయి. అలాగని దేశంలో సినీ సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్‌ వాడుతున్నారనుకుంటే పొరబాటే! హైస్కూలు కుర్రాళ్లు కూడా డ్రగ్స్‌ బారినపడుతున్న దాఖలాలు ఉన్నాయి. ఇంతకీ ఈ డ్రగ్స్‌ ఏమిటి, ఎందుకు వాడతారు, ఎలా వాడతారు, వీటిని వాడితే వాటిల్లే నష్టాలేమిటి? డ్రగ్స్‌పై ఎందుకు ఇంతలా గగ్గోలు చెలరేగుతోంది? ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు డ్రగ్స్‌ను అరికట్టగలుగుతున్నాయా? ఇంతకీ ఈ డ్రగ్స్‌ సంగతేమిటి? వీటి గురించి తెలుసుకోవలసిన విషయాలేంటి? వీటిని వాడితే కలిగే నష్టాలేమిటి? వీటి బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటి?... డ్రగ్స్‌ ఎందుకు వాడతారనేది చాలా సిల్లీ ప్రశ్న. మత్తు కోసం వీటిని వాడతారనేది అందరికీ తెలిసిన సంగతే.

మత్తు కోసం రకరకాల పదార్థాలను వాడటం చరిత్రలో చాలాకాలం నుంచి ఉన్నదే. వేల ఏళ్ల కిందటి నుంచే మద్యం, గంజాయి, పొగాకు, నల్లమందు, మత్తునిచ్చే పుట్టగొడుగులు (మేజిక్‌ మష్‌రూమ్స్‌) వంటి పదార్థాలు వాడుకలో ఉన్నాయనేందుకు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతిసిద్ధంగా దొరికే మత్తు పదార్థాలు. వీటిని తలదన్నే సింథటిక్‌ మత్తు పదార్థాలను తయారు చేయడం గత శతాబ్దిలో మొదలైంది. గడచిన ఆరేడు దశాబ్దాల్లో వీటి వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వీటి తయారీ, సరఫరా, అమ్మకాల వెనుక మాఫియా ముఠాలు పనిచేస్తూ, సమాంతర ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలకెక్కుతున్నవి ఈ సింథటిక్‌ డ్రగ్స్‌కు సంబంధించిన కేసులే. వీటి మత్తు మొదట్లో గమ్మత్తుగా అనిపిస్తుంది. గమ్మత్తయిన మత్తు క్రమంగా అలవాటుగా మారుతుంది. చివరకు వదులుకోవాలనుకున్నా వదులుకోలేని వ్యసనంగా మారుతుంది. మత్తులో నిరంతరం మునిగితేలే పరిస్థితిలో చిక్కుకుంటే, చివరకు ఆరోగ్యం చిత్తవుతుంది. శరీరం శిథిలమవుతుంది. అర్ధంతరంగా మృత్యువు కబళించేస్తుంది.

గంజాయి, నల్లమందు వంటి మత్తుపదార్థాలపై తొలినాళ్లలో పెద్దగా ఆంక్షలు ఉండేవి కావు. మతపరమైన వేడుకల్లో వీటి వాడకం ప్రాచుర్యంలో ఉండటంతో ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించేవి కావు. ప్రభుత్వాలు పట్టించుకోని కాలంలో జనాలు వీటిని బహిరంగంగానే ఉపయోగించేవారు. తొలిసారిగా 1925లో అమెరికాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ఓపియమ్‌ కన్వెన్షన్‌’లో మార్ఫిన్, హెరాయిన్‌లపై నిషేధం అమలులోకి వచ్చింది. అంతకుముందు ఈ రెండు మాదకద్రవ్యాలనూ వైద్యులు తమ రోగులకు ఇష్టానుసారం సిఫారసు చేస్తూ వచ్చేవారు. పత్రికల్లో ‘హెరాయిన్‌’ ప్రకటనలు కూడా కనిపించేవి. మార్ఫిన్, హెరాయిన్‌లు తొలితరం సింథటిక్‌ డ్రగ్స్‌. వీటి వాడుకను కట్టడి చేసిన కొన్ని దశాబ్దాలకు– 1960, 70 దశకాల నాటికి మరికొన్ని సింథటిక్‌ డ్రగ్స్‌ వ్యాప్తిలోకి వచ్చాయి.

డీఓఎం (డైమీథాక్సి4 మీథైలాంఫెటామిన్, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైథాలమైడ్‌), ఏఎల్‌డీ–52 (1–ఎసెటైల్‌ ఎల్‌ఎస్‌డీ), పీసీపీ (ఫెన్‌సైక్లిడిన్‌) వంటి వాటి అక్రమ విక్రయాలు అమెరికా సహా పలు దేశాల్లో విచ్చలవిడిగా సాగేవి. వీటి తర్వాత 1980, 90 దశకాల్లో ఎండీఎంఏ (మీథైలెనడయాక్సిమీథాంఫెటామైన్‌) (దీనినే ‘ఎక్స్‌టసీ’గా పిలుచుకుంటారు), ఏఎంటీ (మీథైల్‌ట్రిప్టామైన్‌), బీజెడ్‌పీ (బెంజైల్‌పైపరాజిన్‌), టీఎఫ్‌ఎంపీపీ (ట్రైఫ్లోరోమీథైల్‌ఫెనైల్‌పైపరాజిన్‌), మీథాంఫెటామిన్, మెథ్‌కాథినోన్‌ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ విరివిగా వాడుకలోకి వచ్చాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ, ప్రభుత్వాలేవీ వీటిని అరికట్టలేకపోతున్నాయి. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సింథటిక్‌ డ్రగ్స్‌ అమ్మకాలు మరింతగా ఊపందుకున్నాయి. ‘ఆన్‌లైన్‌’ లావాదేవీలతోనే ఇవి సునాయాసంగా దేశాంతరాలను, ఖండాంతరాలను దాటుతున్నాయి.

కఠోర వాస్తవాలు
మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌’ (యూఎన్‌ఓడీసీ) గత ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌–2019’ నివేదికలో కొన్ని కఠోర వాస్తవాలను బయటపెట్టింది. ఈ నివేదికను 2017 నాటి లెక్కలను క్రోడీకరించి రూపొందించారు. దీని ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌ దుర్వినియోగం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు దాదాపు 3.50 కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరిలో ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే ఈ సమస్యల నుంచి బయట పడేందుకు అవసరమైన వైద్య సహాయాన్ని పొందగలుగుతున్నారు. మిగిలిన వారు డ్రగ్స్‌ ఊబిలోనే ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నివేదిక ప్రకారం... నల్లమందు నుంచి ఉత్పత్తి చేసే మాదకదవ్య్రాలను 5.30 కోట్ల మంది వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారు 1.10 కోట్లకు పైగానే ఉన్నారు. వీరిలో 14 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు కాగా, మరో 56 లక్షల మంది హెపటైటిస్‌–సి రోగులు. డ్రగ్స్‌ దుర్వినియోగం కారణంగా 2017లో 5.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నివేదిక ప్రకారం గడచిన ఏడాది వ్యవధిలో డ్రగ్స్‌ వాడిన వారి సంఖ్య 27.1 కోట్లు. అంటే ప్రపంచ జనాభాలో 5.5 శాతం. వీరంతా 15–64 ఏళ్ల వయసు వారు. 

ప్రపంచవ్యాప్తంగా కొకైన్‌ ఉత్పత్తి 2017లో రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ ఏడాది 1976 టన్నుల కొకైన్‌ ఉత్పత్తి జరిగింది. అదే ఏడాది అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన కొకైన్‌ కూడా రికార్డు స్థాయిలోనే ఉంది. వివిధ దేశాల్లోని అధికారులు అక్రమంగా తరలిస్తున్న 1275 టన్నుల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సింథటిక్‌ డ్రగ్స్‌ ఎన్ని మార్కెట్‌లోకి వస్తున్నా, డ్రగ్స్‌ వినియోగంలో ఇప్పటికీ గంజాయిదే అగ్రస్థానం. వరల్డ్‌ డ్రగ్‌ రిపోర్ట్‌–2019 ప్రకారం 2017లో గంజాయి వినియోగదారుల సంఖ్య 18.8 కోట్లు. గంజాయిపై నిషేధం ఉన్నా, మన దేశంలో కొన్నిచోట్ల దేవాలయాల్లో గంజాయిని ప్రసాదంగా పంచిపెట్టే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక గంజాయి అక్రమసాగు, రవాణా సంఘటనలు తరచుగా వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. 

మన దేశంలో పరిస్థితి
మన దేశంలో గంజాయి, నల్లమందు వాడకం చిరకాలంగా ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో సింథటిక్‌ డ్రగ్స్‌ వాడకం 1930 దశకం నుంచే ప్రారంభమైనా, మన దేశంలోకి కొంత ఆలస్యంగా అడుగుపెట్టాయి. దేశంలో వీటి ప్రభావం మొదలైన తొలినాళ్లలోనే– అంటే 1970 దశకం నాటికి డ్రగ్స్‌ ఇతివృత్తంగా సినిమాలు రూపుదిద్దుకున్నాయి. బాంబే (ఇప్పటి ముంబై) కేంద్రంగా  రాజ్యమేలుతున్న మాఫియా ముఠాలు ఆర్థికంగా బలపడటానికి ఇక్కడకు డ్రగ్స్‌ తీసుకురావడం, సంపన్నులైన యువతను వాటికి అలవాటు చేయడం ప్రారంభించాయి. మాఫియాతో రాసుకు పూసుకు తిరిగే బాలీవుడ్‌ సెలబ్రిటీల్లో సైతం కొందరు డ్రగ్స్‌ ఊబిలో చిక్కుకున్నారు. క్రమంగా సింథటిక్‌ డ్రగ్స్‌ దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు, చివరకు ఒక మోస్తరు పట్టణాలకు సైతం పాకాయి. దేశంలో నానాటికీ డ్రగ్స్‌ బెడద పెరుగుతుండటంతో వీటిని అరికట్టడం రోజువారీ శాంతిభద్రతలను కాపాడే పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం 1986లో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోను (ఎన్‌సీబీ) ఏర్పాటు చేసింది. డ్రగ్స్‌ అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంగా ఏర్పడిన ఎన్‌సీబీ వివిధ రాష్ట్రాల్లోని పోలీసు దళాలు, కేంద్రం అధీనంలోని కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్, సీబీఐ, సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (సీఈఐబీ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో సహా వివిధ పోలీసు, గూఢచర్య దళాల సహకారంతో పనిచేస్తోంది. డ్రగ్స్‌ బెడదను అరికట్టడానికి ప్రభుత్వం ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినా, దేశంలో డ్రగ్స్‌ వినియోగం నానాటికీ పెరుగుతూనే ఉంది. దాదాపు ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒక చోట డ్రగ్స్‌ పట్టుబడుతూనే ఉన్నా, ఈ వ్యవహారాల్లో సెలబ్రిటీల ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే వార్తలు బాగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆర్థిక తాహతు, కుటుంబ మద్దతు ఉన్న కొందరు రీహాబిలిటేషన్‌ చికిత్స తీసుకుని, ఈ ఊబి నుంచి బయటపడుతున్నా, చాలామంది వెనక్కు రాలేక ఇందులోనే చిక్కుకుని అర్ధంతరంగా మరణిస్తున్నారు.

సింథటిక్‌ డ్రగ్స్‌...  కొన్ని నిజాలు
సింథటిక్‌ డ్రగ్స్‌ ఎక్కువగా అక్రమ లాబొరేటరీల్లో తయారవుతుంటాయి. వీటిలో వాడే పదార్థాలు ఏమిటో, వాటి పరిమాణం ఎంత ఉందో, అవి కలిగించే ప్రభావం ఏమిటో తెలుసుకోవడం దుస్సాధ్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండువందలకు పైగా సింథటిక్‌ డ్రగ్స్‌ వాడుకలో ఉన్నాయి. వీటిలో దాదాపు 90 శాతం డ్రగ్స్‌ గంజాయి నుంచి వేరు చేసిన రసాయనాలతో చేసినవి కాగా, మిగిలినవి నల్లమందు, ఇతర పదార్థాల నుంచి వేరు చేసిన రసాయనాలతో తయారు చేస్తారు.  వీటిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో ఒకటైన ‘ఫెంటామైన్‌’ను కేన్సర్‌ రోగులకు నొప్పి నివారణ కోసం కట్టుదిట్టమైన వైద్య పర్యవేక్షణలో ఉపయోగిస్తారు. ఇది మార్ఫిన్‌ కంటే దాదాపు ఎనభై నుంచి వంద  రెట్లు శక్తిమంతమైనది. అక్రమ మార్కెట్‌లో దీనిని హెరాయిన్‌కు జోడించి అమ్ముతున్నారు. గంజాయి నుంచి వేరుచేసిన రసాయనాలతో రూపొందించిన కృత్రిమ గంజాయి (సింథటిక్‌ మార్జువానా) వాడకం కూడా ఇటీవల బాగా పెరిగింది. ‘స్పైస్‌’, ‘కే2’ అనే పేర్లతో దీనిని రేవ్‌ పార్టీల్లో వాడుతున్నట్లు చాలా దేశాల్లో బయటపడింది. ఇదే కాకుండా, ‘స్మైల్‌’, ‘ఎన్‌–బాంబ్‌’ పేర్లతో పిలుచుకునే సింథటిక్‌ ఎల్‌ఎస్‌డీ, మీథాక్సమైన్‌ (ఎంఎక్స్‌ఎం), ఫెన్‌క్లిడిన్‌ (పీసీపీ) వంటివి కూడా రేవ్‌ పార్టీల్లో వాడుతున్నట్లుగా తెలుస్తోంది.

నేషనల్‌ డ్రగ్‌ డిపెండెన్స్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ (ఎన్‌డీడీటీసీ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలోని వివరాలు మన దేశంలో డ్రగ్స్‌ వ్యాప్తి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం..

  • హెరాయిన్, మార్ఫిన్‌ సహా నల్లమందు ఆధారిత డ్రగ్స్‌కు (ఓపియాయిడ్స్‌) బానిసలైన వారి సంఖ్య 2.60 కోట్లు. వీరిలో దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్‌ వాడకం వల్ల తలెత్తిన తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
  • దేశంలో సగానికి పైగా పరిమాణంలోని ఓపియాయిడ్స్‌ వినియోగం జరుగుతున్నది తొమ్మిది రాష్ట్రాల్లోనే. అవి: ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌. 
  • మన దేశంలో ముక్కుతో పీల్చే మాదకద్రవ్యాలు, నిద్రమాత్రలు వాడుతున్న వారి సంఖ్య 1.18 కోట్లకు పైగా ఉంది. ముక్కుతో పీల్చే మాదకద్రవ్యాలకు బానిసలైన వారిలో 4.6 లక్షల మంది పిల్లలు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 
  • ఇక ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్‌ తీసుకునేవారు మన దేశంలో కాస్త తక్కువగానే ఉన్నారు. వీరి సంఖ్య 8.5 లక్షలు. మన దేశంలో ఇంజెక్షన్ల రూపంలో తీసుకునే డ్రగ్స్‌లో ఎక్కువగా హెరాయిన్‌ (48 శాతం), బ్యూప్రెనార్ఫైన్‌ (46 శాతం) వినియోగంలో ఉన్నాయి.
  • ఇంజెక్షన్ల రూపంలో డ్రగ్స్‌ వాడుక ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ (1,00,000), పంజాబ్‌ (88,000), ఢిల్లీ (86,000) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
  • మన దేశంలో డ్రగ్స్‌ను ఇంజెక్షన్లుగా తీసుకునే వారిలో దాదాపు 27 శాతం మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు. డ్రగ్స్‌ తీసుకునేటప్పుడు ఒకే సూదిని ఒక బృందం మొత్తం పంచుకోవడం వంటి ప్రమాదకరమైన అలవాటు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement