వెబ్‌సిరీస్: బృంద
విడుదల: ఆగష్టు 2
నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి
రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల
ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్
జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్
ఎపిసోడ్స్: 8
స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
కథ
కథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్‌తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్‌తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది.
మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్‌కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు.
అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్‌ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ.
త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్‌గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.
ఎలా ఉందంటే..
కథ ప్రారంభం 1996 టైమ్‌లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది.
పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సిరీస్‌ను నడిపించారు.
బృంద ఇన్వెస్టిగేషన్‌లో అక్కడక్కడ లాజిక్‌లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్‌గా బృంద ఇన్వెస్టిగేషన్‌తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment