టైటిల్ : బుజ్జి.. ఇలారా
నటీనటులు :సునీల్, ధన్‌రాజ్, చాందిని తమిళరసన్, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, పోసాని కృష్ణమురళీ, సత్యకృష్ణ తదితరులు
నిర్మాణ సంస్థ: ఎస్ఎన్ఎస్ క్రియేషన్
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి
దర్శకత్వం:‘గరుడ వేగ’ అంజి
సంగీతం : సాయి కార్తిక్
సినిమాటోగ్రఫీ: ‘గరుడ వేగ’ అంజి
ఎడిటర్: చోటా కే ప్రసాద్
కథేంటంటే..
వరంగల్ నగరంలో చిన్న పిల్లలు వరసగా కిడ్నాప్‌కి గురవుతుంటారు. ఈ కిడ్నాప్ వ్యవహారం మట్వాడ పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన సీఐ కేశవ నాయుడు(ధన్‌రాజ్)కు సవాల్‌గా మారుతుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో రెండు వేరు వేరు ముఠాలు పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని గుర్తిస్తారు. అయితే వారిలో ఓ ముఠా పిల్లలను ముంబైకి సరఫరా చేస్తే.. మరో ముఠా మాత్రం ఎనిమిదేళ్ల పిల్లల శరీరం నుంచి గుండెని తీసి, వారి మృతదేహాలను అక్కడక్కడ పడేస్తుంటారు.
రెండో ముఠా సభ్యులను పట్టుకునే క్రమంలో కేశవ్‌కు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. పిల్లల కిడ్నాప్ వ్యవహరం వెనుక తన మామ(శ్రీకాంత్ అయ్యంగార్) హస్తం ఉందని గుర్తిస్తాడు. అతన్ని పట్టుకునే క్రమంలో కేశవ్‌ని ప్రమాదానికి గురవుతాడు. పోలీసు అధికారి మహ్మద్ ఖయ్యూం(సునీల్) కావాలనే వ్యాన్‌తో కేశవ్‌పై దాడి చేస్తాడు. అసలు ఈ ఖయ్యూం ఎవరు? సీఐ కేశవ్‌పై ఎందుకు దాడి చేశాడు? ప్రమాదం తర్వాత కేశవ్‌కు తెలిసిన భయంకరమైన నిజాలేంటి? అసలు పిల్లలను కిడ్నాప్ చేస్తుందెవరు? ఎందుకు చిన్నారుల గుండెలను అపహరిస్తున్నారు? ఈ మిస్టరీని మహ్మద్ ఖయ్యూం, కేశవ్ కలిసి ఎలా ఛేదించారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
‘బుజ్జి.. ఇలారా’.. ఓ సైకలాజికల్ థ్రిల్లర్. టైటిల్, కాస్టింగ్‌ని చూసి ఇదేదో సాఫ్ట్ సబ్జెక్ట్ అనుకొని థియేటర్స్‌కు వెళ్లే ఆడియన్స్‌కి ఢిపరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఎదురవుతుంది. కథలో ఊహించని ట్విస్టులు, మలుపులు ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగిస్తాయి. భార్య అను(చాందిని తమిళరాసన్)తో కలిసి కేశవ్ వరంగల్‌కి రావడం.. అక్కడ పిల్లలు కిడ్నాఫ్ అవడం.. దానిని ఛేదించడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. వినడానికి ఇది సింపుల్‌గా ఉన్నా.. ఊహించిన ట్విస్ట్‌లతో ప్రేక్షకుడికి సీటుకే పరిమితమయ్యేలా చేస్తుంది.
కిడ్నాప్ వ్యవహారం వెనుక తన మామ ఉన్నాడని కేశవ్ అనుమానించడం, అతన్ని పట్టుకునే క్రమంలో మహ్మద్ ఖయ్యూమ్‌గా సునీల్ ఎంట్రీ ఇవ్వడంతో సెకడాఫ్‌పై ఆసక్తి కలుగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అంచనా వేయలేని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. అదే క్రమంలో కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బంది కలిగిస్తాయి. క్లైమాక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులు హర్షిస్తారని చెప్పలేం. చివరి 10 నిమిషాలు హింసను అతిగా చూపించడం సినిమాకు ప్రతికూలంగా మారినట్టు అనిపిస్తుంది. థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారికి ‘బుజ్జి ఇలా రా’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే...
కమెడియన్ ధన్‌రాజ్ ఇలాంటి పాత్రలో నటించి పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఇన్నాళ్లు కామెడీ పాత్రల్లో కనిపించిన ధన్‌రాజ్.. ఇందులో సీరియస్ పోలీసు అధికారి రోల్ చేసి మెప్పించాడు. సీఐ కేశవ్ పాత్రలో ధన్‌రాజ్ ఒదిగిపోయాడు. తెరపై కొత్త ధన్‌రాజ్‌ని చూస్తారు. ఇక సీఐ మహ్మద్ ఖయ్యూంగా సునీల్ ఆకట్టుకున్నాడు. గతంలో కూడా సునీల్ ఇలాంటి పాత్రల్లో నటించి మెప్పించాడు. ఇక ఇక్కడ హీరోయిన్ చాందినీ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సీఐ కేశవ్ భార్య అను పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సినిమా అంత ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌తో ఆమె నటన మరో ఎత్తు. శ్రీకాంత్ అయ్యంగార్, భూపాల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాకు ప్రధాన బలం సాయి కార్తిక్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇటీవల వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను గుర్తు చేస్తుంది. ‘గరుడ వేగ’ అంజి దర్శకుడిగానే కాకుండా సినిమాటోగ్రాఫర్‌గాను మంచి పనితీరును కనబరిచాడు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను చకచక పరుగులు పెట్టించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment