Buzz: Allu Arjun, Jr NTR, Ram Charan, And Prabhas Doing Straight Hindi Films - Sakshi
Sakshi News home page

డైరెక్ట్‌ హిందీ సినిమాలు చేస్తున్న తెలుగు హీరోలు.. ఎవరెవరంటే?

Published Fri, Apr 7 2023 10:18 AM | Last Updated on Fri, Apr 7 2023 11:10 AM

Buzz: Allu Arjun, Jr NTR, Ram Charan Doing Straight Hindi Films - Sakshi

పాన్‌ ఇండియా ఫార్ములా భాషాపరమైన హద్దులను చెరిపేసింది. ఒక భాషలో రూపొందించిన చిత్రాలను ఇతర భాషల్లో అనువదించి, విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలకు కూడా హిందీలో మంచి మార్కెట్‌ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్‌ మేకర్స్‌ ‘ఆజా రాజా’ (రా రాజా) అంటూ తెలుగు హీరోలతో స్ట్రయిట్‌ హిందీ చిత్రాలు నిర్మించడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తెలుగు స్టార్స్‌ చేస్తున్న హిందీ స్ట్రయిట్‌ ఫిలింస్‌ విశేషాలు తెలుసుకుందాం..

రవితేజ హీరోగా నటించిన పలు హిట్‌ సినిమాలు హిందీలో డబ్బింగ్‌ అయి, అక్కడి బుల్లితెరపై అడపాదడపా ప్రదర్శితమవుతున్నాయి. ఆ విధంగా హిందీ ప్రేక్షకుల్లో రవితేజకు మంచి పాపులారిటీ ఉంది. ఇప్పుడు స్ట్రయిట్‌గా రవితేజ బాలీవుడ్‌కు వెళ్లనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘మానాడు’ రీమేక్‌లో (హిందీ, తెలుగు) రవితేజ, బాలీవుడ్‌ యాక్టర్‌ వరుణ్‌ ధావన్‌ కలిసి నటించనున్నారట. ఈ చిత్రానికి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని హీరో రానా, ఏషియన్‌ సునీల్‌ నిర్మిస్తారట.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఎన్టీఆర్‌ క్రేజ్‌ మరింత పెరిగిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడంలో యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మాత ఆదిత్యా చోప్రా ఫస్ట్‌ సక్సెస్‌ అయ్యారు. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించనున్న స్పై మూవీ ‘వార్‌ 2’లో హృతిక్‌ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్‌ అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ప్రస్తుతం బీ టౌన్‌లో బలంగా వినిపిస్తున్న ఈ వార్తలు నిజమైతే ఎన్టీఆర్‌ నటించే తొలి స్ట్రయిట్‌ హిందీ చిత్రం ఇదే అవుతుంది.

బాలీవుడ్‌లో అల్లు అర్జున్‌ ఎంట్రీ గురించిన టాక్‌ ఎప్పట్నుంచో ఉంది. అల్లు అర్జున్‌తో ఓ హిందీ సినిమా చేయాలని బాలీవుడ్‌ నిర్మాత దినేష్‌ విజన్‌ ప్రయత్నించారు... కుదర్లేదు. ఆ తర్వాత దర్శక–నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీతో అల్లు అర్జున్‌ సమావేశమవగానే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. కానీ అల్లు అర్జున్‌తో స్ట్రయిట్‌ హిందీ ఫిల్మ్‌ చేసే అవకాశం టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌కు లభించింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. టీ సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్‌ పతాకంపై భూషణ్‌ కుమార్, క్రిషణ్‌ కుమార్, ప్రణవ్‌ రెడ్డి వంగా ఈ సినిమాను నిర్మించనున్నారు.

దేశభక్తి నేపథ్యంతో కూడిన చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు వరుణ్‌ తేజ్‌. శక్తి ప్రతాప్‌సింగ్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, సోనీ పిక్చర్స్‌ ఇండియా, రెనైసాన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సందీప్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ జెట్‌ పైలెట్‌గా చేస్తున్నారు. ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్‌ హీరోయిన్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు హిందీ వ్యూయర్స్‌లో క్రేజ్‌ ఉంది. శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్‌కు యూట్యూబ్‌లో 700 మిలియన్‌ వ్యూస్‌ రావడమే ఇందుకు నిదర్శనం. సాయి శ్రీనివాస్‌ నటించిన తెలుగు చిత్రాల హిందీ అనువాదాలకు అక్కడి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. దీంతో ‘ఛత్రపతి’గా బాలీవుడ్‌కు వెళ్తున్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాకి రీమేక్‌ ఇది. అదే టైటిల్‌తో హిందీలో రీమేక్‌ అయిన ఈ సినిమాకు వీవీ వినాయక్‌ దర్శకత్వం వహించారు. జయంతి లాల్‌ గడ నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది.  

మరికొందరు తెలుగు స్టార్స్‌ కూడా హిందీలో స్ట్రయిట్‌ ఫిల్మ్స్‌ చేసే చాన్స్‌ ఉంది.
‘బాహుబలి’ సక్సెస్‌తో లేటెస్ట్‌ జనరేషన్‌లో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న తొలి హీరోగా ప్రభాస్‌ను చెప్పుకోవచ్చు. ఆ చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాల బడ్జెట్స్‌ పెరిగాయి. బాలీవుడ్‌లో కూడా భారీ ఎత్తున రిలీజ్‌ చేశారు. ప్రభాస్‌ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్, క్రిషణ్‌ కుమార్, ఓం రౌత్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్, వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మించారు. రామాయణంగా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 16న విడుదల కానుంది. అలాగే ప్రభాస్‌ హీరోగా కమిటైన మరో చిత్రం ‘స్పిరిట్‌’. ప్రభాస్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్‌ భూషణ్‌కుమార్, భద్రకాళి పిక్చర్స్‌ సందీప్‌రెడ్డి వంగా, యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. 2024 చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని టాక్‌.

దాదాపు పదేళ్ల క్రితమే హిందీలో ‘జంజీర్‌’ (తెలుగులో ‘తుఫాన్‌’)తో ఎంట్రీ ఇచ్చారు రామ్‌చరణ్‌. ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితం అయ్యారు చరణ్‌. అయితే గత ఏడాది విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ హీరోగా నటించిన రామ్‌చరణ్‌కు బాలీవుడ్‌లో సూపర్‌ క్రేజ్‌ దక్కింది. హిందీలో స్ట్రయిట్‌ చిత్రాలు చేసే దిశగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పదేళ్ల తర్వాత ఓ గెస్ట్‌ రోల్‌లో హిందీ తెరపై కనిపించనున్నారు చరణ్‌. సల్మాన్‌ ఖాన్, వెంకటేశ్‌ నటించిన ‘కిసీ కా భాయ్‌ కీసీ కా జాన్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ గెస్ట్‌ రోల్‌ చేశారు. ఈద్‌ సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. మరోవైపు స్ట్రయిట్‌ హిందీ ఫిల్మ్‌ చేసేందుకు కూడా చరణ్‌ కొన్ని కథలు విన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement