
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'ఛావా' తెలుగులో కూడా సత్తా చాటుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్, రష్మిక ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న హిందీ వర్షన్‌లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో మార్చి 7న థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా రికార్డు నెలకొల్పింది. మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతుంది.
ఛావా సినిమా తెలుగు వర్షన్‌ను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. తొలిరోజే ఈ చిత్రం రూ.3 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సంస్థ తెలిపింది. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం రికార్డ్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే, రెండో రోజు 'ఛావా' తెలుగు కలెక్షన్స్ మరింత పెరిగాయి. రెండు రోజులకు గాను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 6.81 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. నేడు ఆదివారం కావడంతో సులువుగా రూ. 10 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రంలో శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ ఆయన సతీమణి యేసుబాయి భోంస్లే పాత్రలో రష్మిక మందన్న జీవించేశారని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రతో అక్షయ్ ఖన్నా అదరగొట్టేశారని చెప్పవచ్చు. దీంతో ఛావా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment