మానవత్వం చచ్చిపోయిందంటోంది బుల్లితెర నటి చవీ మిట్టల్ (Chhavi Mittal). క్యాన్సర్ చికిత్స వల్ల జుట్టు కోల్పోతున్న తనపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ట్రోల్ చేయడం బాధగా ఉందని పేర్కొంది. తనపై వచ్చిన అసభ్య కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
మానవత్వం చచ్చిపోయింది
మానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ రోజు మరోసారి చూశాను. క్యాన్సర్ చికిత్స వల్ల నేను జుట్టు కోల్పోతుంటే మీరేమో ట్రోల్ చేస్తున్నారు. 2022 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనికి పదేళ్లపాటు ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌తో నా హార్మోన్ చికిత్సకు మూడేళ్లవుతాయి. ఈ ట్రీట్‌మెంట్ వల్ల ఎన్నో దుష్ప్రభావాలున్నాయి. చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బరువు సరిగా లేకపోవడం, మూడ్ స్వింగ్స్, తిమ్మిర్లు.. ఇలా వీటన్నింటితోపాటు జుట్టు కూడా ఊడిపోతుంది.
ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు
అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతిష్టమో నేను మాటల్లో చెప్పలేను. మొదటగా అమ్మతనానికి అవసరమైన రొమ్ము నిలుపుకోవడానికి పోరాడాను. ఇప్పుడు జుట్టు కోసం! ఇలాంటి సమయంలో మీరు చేసే నెగెటివ్ కామెంట్లు నన్ను మరింత కుంగదీస్తున్నాయి. ఇప్పుడీ పోస్ట్ పెట్టడానికి ప్రధాన కారణం.. కొందరు నన్ను ఇష్టపడి నా అకౌంట్ ఫాలో అవడం లేదు. కేవలం ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు. జుట్టు రాలిపోతున్న క్యాన్సర్ వారియర్‌ను ట్రోల్ చేయడానికి మీ మనసెలా అంగీకరించిందో అర్థం కావట్లేదు.
నా ఆత్మస్థైర్యాన్ని చూడు
మీకు తలనిండా వెంట్రుకలు, క్యాన్సర్ లేని జీవితం, నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని ఆశిస్తున్నాను. అలాగే నేను నా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడు అని రాసుకొచ్చింది. కాగా చవీ మిట్టల్.. తుమ్హారీ దిశ, ట్వింకిల్ బ్యూటీ పార్లర్, ఘర్ కీ లక్ష్మీ బేటియాన్, నాగిన్, బందిని, ఏక్ చుట్కి ఆస్మాన్, కృష్ణదాసి వంటి సీరియల్స్‌లో మెరిసింది. ఏక్ వివాహ్.. ఐసా భీ, పాల్ పాల్ దిల్‌కే సాత్ చిత్రాలు చేసింది.
చదవండి: అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్‌తో క్లారిటీ..
Comments
Please login to add a commentAdd a comment