
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మరణం ఇండస్ట్రీకే కాదు, తన కుటుంబానికే తీరని లోటని చిరంజీవి అన్నారు. పలు సినిమాల్లో కైకాలతో కలిసి నటించిన చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ పెద్దను, అన్నయ్యను కోల్పోయాను.
నన్ను ‘తమ్ముడూ’ అని తోడబుట్టినవాడిలా ఆదరించారు. కల్మషం లేని చిన్నపిల్లల మనస్తత్వం ఆయనది.ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన్ను దూరం చేసుకోవడం దురదృష్టకంగా భావిస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ చిరు పేర్కొన్నారు.
ఇక పవన్ కల్యాణ్ సైతం కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కైకాలను అజాత శత్రువని అభివర్ణించిన పవన్ ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. వారి కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు దైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ సంతాపం వ్యక్తం చేశారు.