
సాక్షి, వరంగల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. రాష్ట్రస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్‌కి ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత. వీళ్ళ పేదరికాన్ని చిరంజీవి స్వయంగా తెలుసుకొని వాళ్ళ పెద్దమ్మాయి (వర్ష) ఈ నెల డిసెంబర్ 19 న జరిగే పెళ్లికి 1,00,000 ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సహాయం చేయడం హర్షనీయమని అన్నారు. చిరంజీవిని దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
అభిమానులు ఎవరు కష్టాల్లో ఉన్నా సమాచారం ఇవ్వాలని చిరంజీవే స్వయంగా తమతో చెప్పారని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు తెలిపారు. నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతూ.. రక్త సంబంధీకులు చేయని సాయాన్ని చిరూ చేశారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిది అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్ గౌడ్, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునిర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పెద్ద ఎతున్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment