టైటిల్: కమిటీ కుర్రోళ్లు
నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం తదితరులు
నిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్
నిర్మాత:నిహారిక కొణిదెల
దర్శకత్వం: యదు వంశీ
సంగీతం: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు
విడుదల తేది: ఆగస్ట్ 9, 2024
మెగా డాటర్ నిహారికగా నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై బజ్ ఏర్పడింది. దానికి తోడు చిరంజీవితో సహా మెగా హీరోలంతా ప్రమోట్ చేయడంతో ‘కమిటీ కుర్రోళ్లు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు. గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
బాల్యం.. ప్రతి ఒక్కరికి ఓ మధుర జ్ఞాపకం. మనం ఎంత ఎదిగినా.. ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి హత్తుకుని ఉండే గురుతులన్నీ బాల్యంతోనే ముడిపడి ఉంటాయి. కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తున్నంత సేపు 90ల తరానికి చెందిన వారంతా తమ బాల్యంలోకి తొంగి చూస్తారు. ఆ రోజులు వస్తే బాగుండని ఆశ పడతారు. మనల్నీ బాల్యంలోకి తీసుకెళ్లడంతో డైరెక్టర్ యదు వంశీ సక్సెస్ అయ్యారు. కానీ కథనాన్ని ఆసక్తికరంగా నడపడంతో తడబడ్డాడు. సినిమా ప్రారంభం బాగుంటుంది. అప్పట్లో గ్రామల్లోని పిల్లల మధ్య స్నేహం ఎలా ఉండేది.. కులం, మతం అనే తేడా లేకుండా ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్లు.. అప్పటి ఆటలు.. చిలిపి చేష్టలు అవన్నీ తెరపై చూస్తుంటే నైంటీస్ కిడ్స్ అంతా ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు.
ఇంటర్వెల్ వరకు కథనం చాలా వినోదాత్మకంగా సాగుతూ.. రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. అయితే ఆ ఎమోషన్‌ని అదే స్థాయిలో ద్వితియార్థంలో కొనసాగించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో టచ్ చేసిన రిజర్వేన్ల అంశానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దాన్ని పక్కన పెట్టేసి ఆత్రం చావు సీన్‌ని ఎమోషనల్‌గా మలిచి కన్నీళ్లను తెప్పించాడు. ఆ తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. జాతర సీన్‌ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్ సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలతో పాటు చాలా ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చాలా నేచురల్‌గా నటించారు. శివగా సందీప్ సరోజ్ , సూర్యగా యశ్వంత్ పెండ్యాలా, విలియంగా ఈశ్వర్ రచిరాజు,ఇలా ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో జీవించేశారు. పెద్దోడిగా నటించిన ప్రసాద్ బెహరా.. ఎంత నవ్విస్తాడో..కొన్ని చోట్ల అంతే ఏడిపిస్తాడు. ఇక సీనియర్ నటులైన సాయి కుమార్, గోపరాజు రమణ రోటీన్ పాత్రల్లో మెరిశారు. సత్తయ్యగా నటించిన కంచెరాపాలెం కిశోర్..కొన్ని చోట్ల తనదైన నటనతో ఎమోషనల్‌కు గురి చేస్తాడు.
సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు కథలో భాగంగా సాగుతూ.. వినసొంపుగా ఉంటాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-రేటింగ్: 2.75/5
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment