యదార్థ సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చాయి, సక్సెసయ్యాయి. తాజాగా న్యాయవ్యవస్థకే పెను సవాల్ విసిరిన ఓ మర్డర్ మిస్టరీ కేసుపై ఓ వెబ్ సిరీస్ వచ్చింది. అదే డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్. ఈ డాక్యు సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. మైసూర్ నవాబ్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకిరే ఖలీలి ప్రేమ, పెళ్లి, మిస్సింగ్, హత్యపై ఈ సిరీస్ తెరకెక్కింది. షాకిరే హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవిస్తున్న స్వామి శ్రద్దానంద (మురళీ మనోహర్ మిశ్ర) తాజాగా ఈ వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఈ సిరీస్ తెరకెక్కించిన ఇంటియా టుడే, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు తన లాయర్ ద్వారా నోటీసులు పంపించాడు. తాను సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశానని, ఈ సమయంలో తన గురించి వెబ్ సిరీస్ తీయడం న్యాయాన్ని అతిక్రమించడమే అవుతుందని నోటీసులో పేర్కొన్నాడు. తన హక్కులను కాలరాస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను తక్షణమే నిలిపివేయాలని లేదంటే కోర్టుకు వెళ్తామని తెలిపాడు. అందుకు అయ్యే ఖర్చు దాదాపు రూ.55వేల రూపాయలు మీరే తనకు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ విషయానికి వస్తే..
మైసూర్ దివాన్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు షాకీరే ఖలీలి అందగత్తె. మొదట ఆమెకు భారతీయ దౌత్యవేత్త ఇరాన్ అక్బర్‌తో పెళ్లైంది. కానీ వృత్తిరీత్యా అతడు విదేశాల్లోనే ఉండాల్సి రావడంతో భార్యతో దూరం పెరిగింది. వీరికి నలుగురు ఆడపిల్లలు సంతానం. కొంతకాలానికి ఆమె అతడికి విడాకులిచ్చేసింది. ఆరు నెలలు తిరిగేలోపు 1986లో స్వామి శ్రద్దానంద(మురళీ మనోహర్ మిశ్ర)ను పెళ్లాడింది. ఈ పెళ్లితో షాకీరే తన కుటుంబానికి పూర్తిగా దూరమైంది.
రెండో భర్తతో సంతోషంగా ఉంటుందనుకున్న షాకీరే 1991లో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. మూడేళ్ల విచారణ తర్వాత 1994లో కేసులో పురోగతి కనిపించింది. షాకీరేను తన ఇంటి పెరట్లోనే పాతిపెట్టినట్లు శ్రద్దానంద అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వి చూడగా ఆమె అస్థిపంజరం లభ్యమైంది. ఆమెకు నిద్రమాత్రలు ఇచ్చి బతికుండగానే సమాధి చేశాడన్న బలమైన వాదన కూడా వినిపించింది. ఆమె చేతి గోర్లలో చెక్క పొట్టు కనిపించిందని, ఆ చెక్క పెట్టెలో నుంచి బయటకు రావడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించిందని రిపోర్టుల్లోనూ వెల్లడైంది. దీంతో సుప్రీం కోర్టు నిందితుడు శ్రద్దానందను దోషిగా నిర్దారిస్తూ యవజ్జీవ కారాగార శిక్ష విధించింది.
ఇప్పటికీ అతడు మధ్యప్రదేశ్ సాగర్‌లోని సెంట్రల్ జైలులో 30 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. సమాధి అనంతరం శ్రద్దానంద దానిపై పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేసేవాడంటూ కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ సిరీస్‌కు డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రతీక్ గ్రాహం దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి. ఇండియా టుడే ఒరిజినల్స్ ప్రొడక్షన్ దీన్ని నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment