
తమిళసినిమా: బహుముఖ ప్రతిభావంతుడు బహుబాషా నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం రాయన్. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. ఎస్‌జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్‌కిషన్, కాళిదాస్ జయరాం, దూసరా విజయన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు. ఈ వేదికపై నటుడు ధనుష్ పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తే బాగుంటుందని ఆయనకు ఫోన్ చేసి ఇది తన 50వ చిత్రం అని చెప్పానన్నారు. అందుకు ఆయన తాను ప్రస్తుతం చాలా చిత్రాలు చేస్తున్నానని రెండు రోజుల్లో నీకు ఏ విషయం చెప్తానని అన్నారు. అన్నట్లుగానే రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి మీ చిత్రం చేస్తున్నాను అని చెప్పారు అన్నారు. అప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అన్నారు.
కాగా ఇటీవల ధనుష్‌పై చాలా వదంతులు ప్రచారం అయిన విషయం తెలిసిందే. వాటిపై కూడా స్పందించిన ధనుష్ తానేంటో తనకు తెలుసని తన తల్లిదండ్రులకు, తన మిత్ర బృందానికి తెలుసని, ప్రారంభ దశ నుంచి బాడీ షేమింగ్‌కు గురయ్యారని పేర్కొన్నారు. అదేవిధంగా అనవసరపు వదంతులు, చెడ్డ పేరు, వెన్నుపోట్లు అంటూ పలు విషయాలు జరిగిన ఇంకా తాను ఇప్పుడిలా మీ ముందు నిలబడ్డానంటే అందుకు మీరే (ప్రేక్షకులను ఉద్దేశించి) కారణం అన్నారు.

అదేవిధంగా తాను పోయెస్‌గార్డెన్లో ఇల్లు నిర్మించుకోవడానికి కారణాన్ని కూడా తెలుపుతూ పదహారేళ్ల వయసులోనే సెక్యూరిటీని బతిమాలి పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ ఇంటిని చూడడానికి వెళ్లారన్నారు. అప్పుడే తాను ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కలిగిందన్నారు. దాన్ని ఇటీవలే నెరవేర్చుకున్నట్లు ధనుష్ పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం పోయెస్ గార్డెన్స్‌లో సుమారు రూ. 150 కోట్లతో తనకు నచ్చిన విధంగా అద్భుతమైన ఇల్లు ధనుష్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment