‘ప్యార్ కియా తో డర్నా క్యా..’ అంటూ ‘మొఘల్ ఎ అజం’ (1960) చిత్రంలో వెండితెరపై అనార్కలిగా ప్రేమ కురిపించిన మధుబాలను నాటి తరం అంత సులువుగా మర్చిపోదు. ఈ తరం ప్రేక్షకుల కోసం ఆమె జీవితం వెండితెరకు రానుంది. ‘ఇండియన్ సినిమా సౌందర్య దేవత’గా కితాబులందుకున్న మధుబాల తన ఇరవయ్యేళ్ల కెర్‌ర్‌లో అరవైకి పైగా చిత్రాల్లో నటించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55, హాఫ్ టికెట్, మహల్, బాదల్’.. ఇలా పలు చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు మధుబాల. 1933లో జన్మించిన మధుబాల అతి చిన్న వయసు (36)లోనే కన్ను మూశారు.
ఈ 36 ఏళ్ల జీవితంలో మధుబాల సినీ, వ్యక్తిగత జీవితం గురించి తెలియని చాలా విషయాలను బయోపిక్‌లో చూపించనున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్‌తో అనుబంధం, ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్‌కుమార్‌తో వివాహం వంటి విషయాలూ ఈ చిత్రంలో ఉంటాయట. ఆలియా భట్‌తో ‘డార్లింగ్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన జస్మీత్ కె రీన్ మధుబాల బయోపిక్‌కి దర్శకురాలు.
ఈ చిత్రాన్ని మధుబాల వెంచర్స్ పతాకంపై మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ నిర్మించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, బ్రూయింగ్ థాట్స్ ్రౖపైవేట్ లిమిటెడ్ కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉంటాయి. ‘‘ఈ చిత్రంతో ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయాలనే ఆలోచన లేదు. మధుబాల జీవితం గురించి ఉన్న కొన్ని అపోహలను ఈ చిత్రం తొలగిస్తుంది. సినిమా కోసం కొంత స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ నిజాయితీగానే రూపొందిస్తాం’’ అని మధుర్ పేర్కొన్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాలేదు. కాగా శుక్రవారం ఈ బయోపిక్ ప్రకటన వచ్చినప్పట్నుంచి మధుబాలగా నటించే చాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందనే చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment