టైటిల్: దాస్ కా ధమ్కీ
నటీనటులు: విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేశ్, రోహిణి, తరుణ్ భాస్కర్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు
నిర్మాణ సంస్థ: విశ్వక్ సేన్ సినిమాస్
నిర్మాత: విశ్వక్ సేన్
దర్శకత్వం: విశ్వక్ సేన్
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ: దినేష్ బాబు
విడుదల తేది: మార్చి 22, 2023
టాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్‌లో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం సరైన హిట్ పడలేదు. మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి నటించిన పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు.
దీంతో ఈ సారి తనకు అచ్చొచ్చిన మాస్ జోనర్‌ని ఎంచుకున్నాడు. ఆయన హీరో గా నటిస్తూనే డైరెక్టర్ గా, నిర్మాతగా మారి ‘మాస్ కా ధమ్కీ’ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు.. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మాస్ కా ధమ్కీ’పై బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
కృష్ణ దాస్ ( విశ్వక్ సేన్) ఓ అనాథ. స్నేహితులు ఆది(హైపర్ ఆది), మహేశ్(రంగస్థలం మహేశ్)లతో కలిసి ఉంటూ.. ఓ స్టార్ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తుంటాడు. అక్కడికి కస్టమర్‌గా వచ్చిన కీర్తి(నివేదా పేతురాజ్)తో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి కోటీశ్వరుడిలాగా నటిస్తాడు. కట్ చేస్తే.. అచ్చం కృష్ణదాస్ లాగే ఉండే సంజయ్ రుద్ర(విశ్వక్ సేన్) ఎస్సార్ ఫార్మా కంపెనీ స్థాపించి, క్యాన్సర్‌ని పూర్తిగా తగ్గించే డ్రగ్ కనిపెట్టడం కోసం తన బృందంతో కలిసి పోరాతుంటాడు.
డ్రగ్ కోసం వ్యాపారవేత్త ధనుంజయ్(అజయ్)తో రూ. 10 వేల కోట్లు డీల్ కుదుర్చుకుంటాడు. ఓ కారణంగా సంజయ్ రుద్ర ప్లేస్‌లోకి కృష్ణదాస్ వస్తాడు. తన అన్న కొడుకు సంజయ్‌లా నటించమని స్వయంగా అతని బాబాయ్(రావు రమేశ్)కృష్ణదాస్‌ని తీసుకొస్తాడు. అతను ఎందుకు అలా చేశాడు? సంజయ్ ప్లేస్‌లోకి వచ్చాక కృష్ణదాస్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? డ్రగ్ కోసం సంజయ్ రుద్ర ఏం చేశాడు? అతని వేసిన ప్లాన్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే థియేటర్‌లో ‘దాస్క్ కా ధమ్కీ’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సినిమాకు కథ అందించింది బెజవాడ ప్రసన్న కుమార్. పాత కథలనే అటు ఇటు మార్చి దానికి కొత్త ట్రీట్‌మెంట్ ఇచ్చి స్క్రీన్‌ప్లేతో మాయ చేయడం ప్రసన్న కుమార్‌కు బాగా అలవాటు. మొన్నటి బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ చిత్రంలోనూ ఇదే చేశాడు. ఇప్పుడు మాస్క్ కా ధమ్కీలో కూడా అదే పని చేశాడు. తెలిసిన కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఒకరి ప్లేస్‌లోకి ఒకరు రావడం... చివర్లో వచ్చే ట్విస్టులు.. ఇవన్ని ‘ధమాకా’, ‘ఖిలాడీ’తో పాటు ఇంతకు ముందు వచ్చిన చాలా తెలుగు సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఇక లాజిక్స్ గురించి అసలే మాట్లాడొద్దు. కొన్ని ట్విస్టులకు కూడా ప్రేక్షకులు ఈజీగా పసిగడతారు.
అలా అని సినిమా మొత్తం ఊహకందేలా రొటీన్‌గా సాగుతుందని చెప్పలేం. కొన్ని చోట్ల వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌లో కృష్ణదాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా సాగుతుంది. కీర్తితో ప్రేమాయణం రొటీన్‌గా ఉన్నప్పటికీ.. మధ్య మధ్యలో ఆది వేసే పంచులతో పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ను మాత్రం వరుస ట్విస్టులతో ప్లాన్ చేశారు. అయితే వాటిలో కొన్ని ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురి చేయకుండా.. సహనానికి పరీక్షగా మారాయి. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా ఊహించొచ్చు. చాలా చోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. కొత్తదనం కోరుకోకుండా..కాస్త కామెడీగా ఉంటే చాలు అనుకునేవాళ్లకి ‘దాస్ కా ధమ్కీ’ నచ్చుతుంది.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాతో నటన పరంగా విశ్వక్ సేన్ ఒక మొట్టు ఎక్కాడు. వెయిటర్ కృష్ణదాస్, డాక్టర్ సంజయ్ రుద్ర రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విశ్వక్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఒకవైపు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను వహిస్తూ.. ఇంత చక్కగా నటించిన విశ్వక్ సేన్‌ని అభినందించొచ్చు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు.
కీర్తి పాత్రకు నివేదా పేతురాజ్ న్యాయం చేసింది. సెకండాఫ్‌లో ఆమె ఇచ్చే ట్విస్ట్ బాగుంటుంది. సంజయ్ బాబాయ్‌గా రావు రమేశ్ తనదైన నటనతో మెప్పించాడు. హీరో స్నేహితులుగా ఆది, రంగస్థలం మహేశ్‌ల కామెడీ బాగుంది. ఒక తరుణ్ భాస్కర్ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ.. మహేశ్, అతని మధ్య వచ్చే సీన్ బాగా పేలింది. రోహిణి, అజయ్, అక్షరా గౌడ, పృథ్విరాజ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. రామ్ మిరియాల సంగీతం అందించిన 'మావా బ్రో' తో పాటు మిగిలిన పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment