యాభైలో పడ్డారంటే యాభై ఏళ్ల వయసులో పడ్డారనుకుంటున్నారేమో! ఆ మాటకొస్తే.. ధనుష్, విజయ్ సేతుపతి, అంజలికన్నా సీనియర్ ఆర్టిస్ట్ అయిన సిమ్రానే ఇంకా వయసు పరంగా యాభై టచ్ అవ్వలేదు. ఆమె యాభైలోకి అడుగుపెట్టడానికి ఇంకో రెండు మూడేళ్లు పడుతుంది. ఇక ధనుష్, భరత్ నలభై టచ్ చేస్తే.. ఇంకో అయిదు అదనంగా అంటే... సేతుపతి నలభై అయిదు టచ్ చేశారు. అంజలి నలభై లోపే. ఈ అయిదుగురూ అయిదుపదుల్లో పడింది సినిమాల పరంగా. ఈ అయిదుగురూ చేస్తున్న 50వ సినిమా విశేషాల్లోకి వెళదాం...
రెండు దశాబ్దాల్లో రెండోది
రెండు దశాబ్దాల కెరీర్‌లో నటుడు– నిర్మాత ధనుష్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘పా. పాండి’ (2017). ఈ సినిమా తర్వాత మరో సినిమా కోసం దర్శకుడిగా ధనుష్ మెగాఫోన్ పట్టాలనుకున్నారు. ‘నాన్ రుద్రన్’గా ప్రచారం జరిగిన ఈ సినిమా ఎందుకో సెట్స్‌పైకి వెళ్లలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఇది ధనుష్ కెరీర్‌లో 50వ సినిమా కావడం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఉంటుందట. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది.
మహారాజా
హీరో.. విలన్.. సపోర్టింగ్ యాక్టర్... ఇలా పాత్రకు తగ్గట్టు ఇమిడిపోతూ విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకున్నారు విజయ్ సేతుపతి. కెరీర్‌లో విజయ్ సేతుపతి 50 చిత్రాల మైలురాయికి చేరుకున్నారు. ఆయన 50వ సినిమాకు ‘మహారాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నితిలన్ సామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ మమతా మోహన్‌దాస్, నట్టి నటరాజ్, బాలీవుడ్ దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా తుది దశకు చేరుకున్నాయి. ‘పాషన్ స్టూడియోస్’ సుధన్ సుందరం, జగదీష్ పళనీసామి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీపై త్వరలో ఓ స్పష్టత రానుంది.
లా స్టూడెంట్
దక్షిణాదిలో నటిగా అంజలికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తున్న అంజలి కెరీర్‌లో హాఫ్ సెంచరీ కొట్టారు. అదేనండీ.. యాభై సినిమాల మైల్‌స్టోన్‌కు చేరుకున్నారు. అంజలి ప్రధాన పాత్రలో అశోక్ వేలాయుధం దర్శకత్వంలో ‘ఈగై’ అనే ఓ కోర్టు డ్రామా మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం అంజలికి 50వది. ఆల్రెడీ చిత్రీకరణ మొదలైంది. ఈ చిత్రంలో అంజలి లా స్టూడెంట్‌గా నటిస్తున్నారని, సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. గ్రీన్ అమ్యూస్‌మెంట్ ప్రొడక్షన్స్, డీ3 ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
సిమ్రాన్ శబ్దం
సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే కాదు..ఉత్తరాదిలో కూడా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు సిమ్రాన్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సిమ్రాన్ కీలక పాత్ర చేస్తున్న మూవీల్లో ‘శబ్దం’ ఒకటి. ‘ఈరమ్’ (తెలుగులో ‘వైశాలి’) చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. లక్ష్మీ మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, లైలా కీలక పాత్రధారులు. సిమ్రాన్‌కు తమిళంలో ఇది 50వ సినిమా కావడం విశేషం.
ప్రేమకోసం...
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన తమిళ చిత్రం ‘కాదల్’ తెలుగులో ‘ప్రేమిస్తే..’గా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత తమిళంలో చాలా సినిమాలే చేశారు భరత్. తెలుగులో మహేశ్‌బాబు ‘స్పైడర్’, సుధీర్‌బాబు ‘హంట్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. కాగా భరత్ కెరీర్‌లో రూపొందిన 50వ సినిమా ‘లవ్’. వాణీ భోజన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఆర్పీ బాలా దర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.
సినీ కెరీర్‌లో అరుదైన మైల్‌స్టోన్ చేరుకున్న ఈ ఐదుగురు
Published Fri, Jul 21 2023 5:22 AM | Last Updated on Fri, Jul 21 2023 10:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment