
నూతన నటుడు సుమన్, గరీమా చౌహాన్ హీరో హీరోయిన్లుగా సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సీతా కళ్యాణ వైభోగమే’. రాచాల యుగంధర్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సతీష్ మాట్లాడుతూ – ‘‘దిల్’ రాజుగారి కాంపౌండ్ నుంచి వచ్చాను. ఓ తండ్రి తన కూతురుపై పెంచుకున్న ప్రేమ ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేదే ఈ చిత్రకథ. ఈ కథలో ప్రణయ్, అమృత ఘటనకు సంబంధించిన అంశాలను ప్రస్తావించాం’’ అన్నారు.
‘‘ఊరికి ఉత్తరాన’ చిత్రం తర్వాత దర్శకుడు సతీష్‌తో నిర్మాతగా నేను అసోసియేట్ అయిన చిత్రం ఇది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు యుగంధర్. ‘‘సినిమాలపై ప్రేమ ఉన్న నిర్మాత యుగంధర్‌తో ప్రతిభావంతుడైన సతీష్ మరో సినిమాను చేస్తుండటం హ్యాపీగా ఉంది. థియేటర్ ఆర్టిస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండవంటి వారు ఇప్పుడు స్టార్స్ అయ్యారు. అలా సుమన్ కూడా మంచి నటుడవుతాడనే నమ్మకం ఉంది’’ అన్నారు తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి మామిడి హరికృష్ణ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment