ఓ సినిమా హిట్టయితే.. ఆ హీరో–దర్శకుడిది హిట్ కాంబినేషన్ అంటారు. ఆ కాంబినేషన్‌లో అభిమానులు మరో సినిమాని ఎదురు చూస్తారు కూడా. ఇప్పుడు కూడా ‘హిట్ కాంబినేషన్’ షురూ అయింది. అయితే ఇది హీరోయిన్–డైరెక్టర్ కాంబినేషన్. ‘రిపీట్టే..’ అంటూ ఒక సినిమా తర్వాత వెంటనే తన మరో సినిమాకి ఆ హీరోయిన్‌నే ఎంపిక చేశారు కొందరు దర్శకులు. ఆ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్ సినిమాల గురించి తెలుసుకుందాం.
దర్శకుడు త్రివిక్రమ్ హీరోయిన్ పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. త్రివిక్రమ్‌తో పూజా హెగ్డేకి ‘అరవిందసమేత వీరరాఘవ’ తొలి సినిమా. ఆ సినిమా సూపర్ హిట్. ఆ వెంటనే ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పూజకు చాన్స్ ఇచ్చారు త్రివిక్రమ్. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మహేశ్‌బాబుతో చేయనున్న సినిమాకి కూడా హీరోయిన్‌గా పూజా హెగ్డేనే తీసుకున్నారు త్రివిక్రమ్. సేమ్ ఒకప్పుడు త్రివిక్రమ్‌తో సమంత ఇలా వరుసగా మూడు సినిమాలు (‘అత్తారింటికి దారేది’ (2013), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అ ఆ’ (2016) చేశారు.
ఇప్పుడు పూజా హెగ్డేని రిపీట్ చేస్తున్నారు త్రివిక్రమ్. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్‌లానే పూజా హెగ్డేకు హ్యాట్రిక్ చాన్స్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ (2017), ‘గద్దలకొండ గణేష్’ (2019) చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు పూజా హెగ్డే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’లోనూ పూజా హెగ్డేనే హీరోయిన్. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రష్మికా మందన్నా ఈ చిత్రం రెండో భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ నటిస్తారు. రెండు భాగాల సినిమా కాబట్టి ఈ కాంబినేషన్ రిపీట్ కావడం సహజం. ఈ చిత్రం షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘ఎఫ్ 2’లో ఓ హీరోయిన్‌గా నటించిన తమన్నా ఈ చిత్రం సీక్వెల్ ‘ఎఫ్ 3’లోనూ నటిస్తున్నారు. ఏప్రిల్ 27న ‘ఎఫ్ 3’ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ముందు మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇంకోవైపు ‘క్రాక్’ (2021) సినిమాకి ముందు దాదాపు మూడేళ్లు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు శ్రుతీహాసన్. ఈ గ్యాప్ తర్వాత ‘క్రాక్’ హిట్‌తో టాలీవుడ్‌లో శ్రుతి సందడి మొదలైంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. తాజాగా బాలకృష్ణ హీరోగా తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా శ్రుతీహాసన్‌నే తీసుకున్నారు గోపీచంద్ మలినేని. ఇక తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ్ల 2018లో వచ్చిన ‘గూఢచారి’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘గూఢచారి’ తర్వాత శోభితా వెంటనే మరో తెలుగు సినిమా చేయలేదు. హిందీ సినిమాల్లో నటించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆమె యాక్ట్ చేసిన తెలుగు చిత్రం ‘మేజర్’. శశికిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది. వీరితో పాటు మరికొందరు దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్‌గా నటించినవారిని రిపీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది.
చదవండి: అనన్య గ్లామరస్‌గానే కనిపించాలి.. ఆమెకు అవసరం: చుంకీ పాండే
Comments
Please login to add a commentAdd a comment