Telugu Director, Writer N Sai Balaji Prasad Dies Due To Covid-19 In Hyderabad - Sakshi
Sakshi News home page

విషాదం: కరోనాతో దర్శకుడు సాయిబాలాజీ మృతి

Published Mon, Apr 26 2021 6:32 PM | Last Updated on Mon, Apr 26 2021 9:33 PM

Director And Writer Sai Balaji Died With Coronavirus - Sakshi

కరోనా కోరలకు సినీరంగంలో మరో ప్రాణం బలి అయింది. సినీరంగంలో మూడున్నర దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ దర్శక, రచయిత సాయిబాలాజీ సోమవారం ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్ లో కరోనాతో శ్వాస అందక హఠాత్తుగా కన్నుమూశారు. సినీ రంగంలో సాయిబాలాజీగా సుపరిచితులైన ఆయన పూర్తి పేరు నక్కల వరప్రసాద్. చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర అలమేలు మంగాపురం ఆయన స్వస్థలం. హీరో శ్రీహరి నటించిన ‘శివాజీ’, ‘ఒరేయ్ తమ్ముడు’, అలాగే ఉదయకిరణ్ ఆఖరి చిత్రం ‘జై శ్రీరామ్’లకు ఆయన దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు కొన్ని పాటలు కూడా రాశారు. హీరో చిరంజీవి నటించిన ‘బావ గారూ బాగున్నారా!’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సాయిబాలాజీవే! అలాగే, ‘సిరి’, ‘అపరంజి’, ‘హాలాహలం’ లాంటి పలు టీవీ సీరియల్స్ కు కూడా ఆయన దర్శకత్వం వహించారు. 

తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడే సినీరంగానికి వచ్చిన సాయిబాలాజీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిసెట్టి వద్ద దర్శకత్వ శాఖలో శిష్యరికం చేశారు. మోహన్ బాబు ‘పెదరాయుడు’, బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, వెంకటేశ్ ‘చంటి’ తదితర అనేక చిత్రాలకు ఆయన పనిచేశారు. రచయిత ఎమ్మెస్ నారాయణతో ‘పెదరాయుడు’లో పాత్ర వేయించి, తెర మీదకు నటుడిగా తీసుకురావడంలో సాయిబాలాజీ కీలకపాత్ర వహించారు. చాలాకాలం పాటు నటుడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్ దర్శక, రచనా శాఖలో ఆయన పనిచేశారు. ముక్కుసూటితనం వెనుక మంచితనం మూర్తీభవించిన సాయిబాలాజీ సినీ రంగంలో నటుడు ప్రకాశ్ రాజ్ తో సహా పలువురికి ఇష్టులు. స్నేహితులైన దర్శకులు కృష్ణవంశీ, వై.వి.ఎస్. చౌదరి రూపొందించిన సినిమాలకు కథా విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సినిమా, స్క్రిప్టులపై సాయిబాలాజీ నిష్కర్షగా వ్యక్తం చేసే అభిప్రాయాలను పలువురు దర్శక, నిర్మాతలు గౌరవించేవారు. 

ప్రపంచ సినిమాతో పాటు వివిధ భారతీయ భాషా చిత్రాలపై ఆయనకు పట్టు ఎక్కువ. సినీ కథ, కథనాల్లోని తాజా మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, నిశితంగా విశ్లేషించడంలో సాయిబాలాజీ దిట్ట. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం పలు సినిమా స్క్రిప్టులతో పాటు ఇటీవల కొన్ని వెబ్ సిరీస్ ల రూపకల్పనకు కూడా ఆయన సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఇంతలోనే కరోనా మహమ్మారి ఆయనను తీసుకుపోయింది. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 57 ఏళ్ళ సాయిబాలాజీకి భార్య గౌరి, కుమార్తె స్నేహ పూజిత ఉన్నారు. కుటుంబ సభ్యులందరికీ అనుకోకుండా కరోనా సోకడంతో, వారం రోజుల నుంచి చికిత్స తీసుకున్నారు. మిగతా కుటుంబసభ్యులు ఇద్దరూ ఇంట్లోనే కోలుకున్నప్పటికీ, ఆయన మాత్రం గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో చివరి చూపు అయినా దక్కకుండా ఆకస్మికంగా ప్రాణాలు వదలడం విషాదం. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు ముగిశాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement