‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు.
► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్ డిపార్ట్‌మెంట్ నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ విక్రమ్ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది.
► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్‌గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి
కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న యూకేలో ఆ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను.
► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంటే ఎంటర్‌టైన్ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్ ఫోన్స్ మెసేజ్‌లను చెక్ చేసుకోనంత వరకు స్క్రీన్ పై ఏ జానర్ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే.
హిందీలో రిలీజ్ చేస్తాం – సునీల్ నారంగ్
‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment