లాక్ డౌన్ సమయంలో మలయాళ కప్పేల చిత్రాన్ని చూశాను. కథలో ఉన్న బలం, కథనం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాను. మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి ‘బుట్ట బొమ్మ’ తెరకెక్కించామని దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ అన్నారు. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► మాది గుంటూరు. కానీ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. కానీ నాకు ముందు నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల సూచన మేరకు ముందు పీజీ పూర్తి చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను.
► ముందుగా రామ్ గోపాల్ వర్మ గారికి చెందిన వర్మ కార్పొరేషన్ లో పనిచేశాను. ఆయన నిర్మించిన శూల్ అనే హిందీ ఫిల్మ్ చేశాను. ఆ చిత్రానికి ఈశ్వర్ నివాస్ దర్శకుడు. ఆయన దగ్గరే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు వర్క్ చేశాను. ఆ తరువాత మా నాన్నగారు మరణించడంతో హైదరాబాద్ వచ్చేశాను. కొంతకాలానికి ఒక స్నేహితుడి ద్వారా సుకుమార్ గారు పరిచయమయ్యారు. ఆయన దగ్గర జగడం నుంచి పుష్ప సినిమా వరకు పని చేశాను.
► కొన్ని చిత్రాలను రీమేక్ చేయగలం, కొన్ని చిత్రాలు చేయలేం. బుట్ట బొమ్మ పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. దీనిని మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటుందనే నమ్మకం కలిగింది. అప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకుందని తెలిసి.. నేనే వారిని సంప్రదించాను. కొన్ని చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.
► మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం. ఫస్టాఫ్ లో కథనం పరంగా ఒక పెద్ద మార్పు కూడా చేశాం.
► బుట్టబొమ్మ సినిమాలో ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అనుకున్నప్పుడు అప్పటికే 'బుట్టబొమ్మ' సాంగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్ పెడితే బాగుంటుందని వంశీ గారు సూచించారు. అలా ఈ టైటిల్ ఖరారైంది.
► ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చాయి. గోపీసుందర్ గారు ఒక పాట, నేపథ్య సంగీతం అందించారు. స్వీకర్ అగస్తి రెండు పాటలు స్వరపరిచారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
► త్రివిక్రమ్, చినబాబు ఈ చిత్రాన్ని చూసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. వారిచ్చిన ప్రశంసలు మాటల్లో చెప్పలేను.
► తదుపరి సినిమా యాక్షన్ జోనర్ లో చేయాలని ఉంది. కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. త‍్వరలోనే కొత్త సినిమా అప్‌డేట్స్ ఇస్తాను.
Comments
Please login to add a commentAdd a comment