
బిగ్‌బాస్ ఓటీటీ షో గ్రాండ్‌గా ముగిసింది. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోలో బుల్లితెర నటి దివ్య అగర్వాల్ విజేతగా అవతరించింది. శనివారం(సెప్టెంబర్ 18)న జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో దివ్య బిగ్‌బాస్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. నిషాంత్ భట్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచాడు. షమితా శెట్టి, రాకేశ్ బాపత్, ప్రతీక్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలతో సరిపెట్టుకున్నారు.
బిగ్‌బాస్ ఓటీటీ స్పెషాలిటీ ఏంటంటే?
హిందీలో బిగ్‌బాస్ 14 సీజన్లు పూర్తయ్యాయి. త్వరలో 15వ సీజన్ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సీజన్ రావడానికి ముందే ప్రయోగాత్మకంగా బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు. దీనికి స్టే కనెక్టెడ్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో కేవలం ఓటీటీ ప్లాట్‌ఫామ్ వూట్‌లోనే ప్రసారమైంది. ఏడు వారాలపాటు ప్రసారమైన ఈ షోను మినీ బిగ్‌బాస్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో బిగ్‌బాస్ ఓటీటీ టైటిల్ గెలుచుకున్న దివ్య బిగ్‌బాస్ 15వ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉందా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. అదే సమయంలో ప్రతీక్.. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న బిగ్‌బాస్ 15వ సీజన్‌లో పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఎవరీ దివ్య అగర్వాల్
దివ్య అగర్వాల్ విషయానికొస్తే ఆమె నటి, డ్యాన్సర్. MTV స్ప్లిట్స్‌విల్లా 10వ సీజన్‌లో పాల్గొన్నప్పుడు ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అంతేకాదు, ఈ సీజన్‌లో ఆమె రన్నరప్‌గా నిలిచింది. MTV ఏస్ ఆఫ్ స్పేస్ 1లో పాల్గొని విజేతగా అవతరించింది. రియాలిటీ షోస్ క్వీన్ దివ్య ద ఫైనల్ ఎగ్జిట్ అనే సినిమాలోనూ నటించింది. గతంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రియాంక శర్మతో పీకల్లోతు ప్రేమ వ్యవహారంతో ఆమె మరింత హైలైట్ అయింది. ప్రస్తుతం ఆమె ఖత్రోన్ కీ ఖిలాడీ 11వ సీజన్ ఫేమ్ వరుణ్ సూద్‌తో డేటింగ్ చేస్తున్నట్లు భోగట్టా!
Comments
Please login to add a commentAdd a comment