ఆత్మవిశ్వాసమే విజయానికి తొలి మెట్టు.. ఇక్కడ చెప్పుకునే బుల్లితెర నటి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. అడిగినదానికి లొంగకపోతే కెరీర్ నాశనం చేస్తామని బెదిరించినా వణికిపోలేదు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా చిన్నాచితకా పనులు చేసింది. చివరికి చెత్త ఏరుకుని రూపాయిరూపాయి కూడబటెట్టింది. నేడు లక్షలు సంపాదిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి.
లైఫ్ సెట్ అనుకున్న సమయంలో..
దివ్యాంక నటి మాత్రమే కాదు యాంకర్, మోడల్ కూడా! తన కెరీర్ మొదలైందే యాకరింగ్‌తో! తర్వాత ఆమె 2005లో మిస్ భోపాల్‌గా కిరీటం అందుకుంది. 'బనూ మే తేరి దుల్హాన్' సీరియల్‌తో క్లిక్ అయింది. ఎన్నో అవార్డులు అందుకుంది. తర్వాత కూడా కొన్ని సీరియల్స్‌లో మెరిసింది. ఇంక తను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదనుకుంది. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా! మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఛాన్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. నిత్యావసరాలు, ఈఎమ్‌ఐలు, ఇంకా ఎన్నింటికో డబ్బులు అవసరమయ్యాయి.
రోడ్డుపై చెత్త ఏరుతూ..
ఎవరో ఏదో ఆఫర్ ఇస్తారని ఎదురుచూస్తూ ఉండేకన్నా.. ఏదో ఒక పని చేయడం మేలనుకుంది. ఐదు వేలు లేదంటే రెండు వేలు ఇచ్చినా కిరాణా సామాను తెచ్చుకోవచ్చనుకుంది. పైగా తనకో పెంపుడు శునకం ఉంది. ఆ వచ్చిన డబ్బుతో దానికి కాస్త తిండిపెట్టవచ్చని ఆలోచించింది. చిన్న పాత్రలిచ్చినా సరే చేస్తానంటూ డైరెక్టర్లను వేడుకుంది. ఈ లోపు రోడ్డుపై చెత్త ఏరడం మొదలుపెట్టింది. అట్టముక్కలను, టూత్‌పేస్ట్ డబ్బాలను ఏరి అమ్ముకుంది. ఒక్క డబ్బాకు ఒక్క రూపాయి ఇచ్చేవాళ్లట. అలా రోజూ చెత్తనంతా సేకరించి దాన్ని అమ్మి డబ్బు సంపాదించింది.
అడ్డదారులు తొక్కడం ఇష్టం లేక
అంతకుముందు దాచుకున్న డబ్బుతో ప్రతినెలా ఈఎమ్‌ఐలు కట్టింది. సరిగ్గా అదే సమయంలో తనకో ఆఫర్ కూడా వచ్చింది. రాత్రికి వస్తానంటే మంచి ఛాన్స్ ఇస్తామన్నారట. అలాంటి అడ్డదారులు తొక్కేబదులు ఇలా సొంతంగా సంపాదించుకోవడమే మేలనుకుంది. తర్వాతి కాలంలో యే హై మొహబ్బతే ధారావాహికలో డాక్టర్ ఇషితా అయ్యర్‌గా ప్రధాన పాత్ర పోషించి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సీరియల్ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దివ్యాంక ఒక్క ఎపిసోడ్‌కు రూ.1- 1.5 లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగింది.
లవ్ బ్రేకప్
నాచ్ బలియే 8వ సీజన్ విన్నర్, ఖత్రోన్ కే ఖిలాడీ 11వ సీజన్ రన్నరప్‌గా నిలిచింది. 2017లో ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో చోటు దక్కించుకున్న మొట్టమొదటి బుల్లితెర నటిగా రికార్డుకెక్కింది. కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఇబ్బందులు పడింది నటి. సీరియల్ నటుడు శరద్ మల్హోత్రాను ప్రాణంగా ప్రేమించింది. కానీ ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. 2016లో నటుడు వివేక్ దహియాను పెళ్లాడింది. వీరిని అభిమానులు ముద్దుగా దివేక్ అని పిలుచుకుంటారు.
చదవండి: వాళ్ల నాన్నకు చెప్పుకోలేని విషయాలు నాతో షేర్ చేసుకుంటాడు.. అలాంటిది..
Comments
Please login to add a commentAdd a comment