RRR తర్వాత డీవీవీ దానయ్య బిగ్‌ ప్లాన్‌.. ఆ హీరో కోసం భారీ ఆఫర్‌ | DVV Danayya Planning Movie With Thalapathy Vijay, Interesting Deets Inside - Sakshi

RRR తర్వాత డీవీవీ దానయ్య బిగ్‌ ప్లాన్‌.. ఆ హీరో కోసం భారీ ఆఫర్‌

Feb 1 2024 7:28 AM | Updated on Feb 1 2024 9:08 AM

DVV Danayya Plan Movie With Vijay - Sakshi

విజయ్‌ ఈ పేరు ఇప్పుడు సినీ పరిశ్రమలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న అతి కొద్ది మంది నటుల్లో ఈయన ఒకరు. విజయ్‌ నటించిన చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, నిర్మాతలకు నష్టాలు రానంతగా స్థాయికి ఆయన చేరుకున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఇటీవల తెరపైకి వచ్చిన 'లియో' చిత్రాన్నే తీసుకోవచ్చు. ఈ చిత్రం విమర్శకుల దాడిని ఎదుర్కొంది. టాక్‌ వ్యతిరేకంగా వచ్చినా, వసూళ్లు మాత్రం రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. ప్రస్తుతం విజయ్‌ తన 68వ చిత్రంలో నటిస్తున్నారు.

ఈయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియనం చేస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్వకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. దీనికి 'ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌' అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్‌ తర్వాత చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఈయన రాజకీయ రంగప్రవేశం గురించి పెద్ద చర్చే జరుగుతుండడమే. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్‌ 69వ చిత్రం ఓకే అయినట్లు తాజాగా సోషల్‌ మీడియాలో ప్రచారం వైరల్‌ అవుతోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్వకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌లో నిర్మించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఆస్కార్‌ బరిలో మూడు అవార్డులను గెలుచుకోవండంతో చిత్ర నిర్మాత 'డీవీవీ దానయ్య' పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. విజయ్‌కు సౌత్‌ ఇండియాలో బిగ్‌ మార్కెట్‌ ఉంది. దీంతో తెలుగు డైరెక్టర్‌తో పాన్‌ ఇండియా సినిమా నిర్మించేందుకు దానయ్య ఉ‍న్నారని సమాచారం.

ఇప్పటికే కథ కూడా విజయ్‌కు వినిపించారట. అది విజయ్‌కు కూడా నచ్చిందని, ఆయన ఇందులో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు టాక్‌. ఈ చిత్రానికి విజయ్‌ ఊహించని స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేసినట్లు వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఇక దీనికి దర్శకుడు ఎవరన్నది త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విజయ్‌ తన 70వ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతారని సమాచారం. విజయ్‌ గతంలో దిల్‌ రాజు నిర్మాతగా వారసుడు చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన త్వరలో రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అవుతున్నట్లు, అందుకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. త్వరలోనే పార్టీ పేరును వెల్లడించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది. దీంతో కొన్ని ఏళ్లు విజయ్‌ సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement