Fahadh Faasil Birthday Special: నటన కొందరి రక్తంలో ఉంటుంది. మరికొందరికి అలవాటు చేసుకుంటే అబ్బుతుంది. ఇంకొందరికి శిక్షణ తప్పనిసరి. కానీ, ఈయనకి మాత్రం కంటిచూపులోనే ఉంటుందట. ఈ మాట అంది ఎవరో కాదు.. యూనివర్సల్ హీరో కమల్‌హాసన్. విక్రమ్‌లో తనతో పాటు నటిస్తున్న ఫహద్ ఫాజిల్‌ను ఆకాశానికి ఎత్తేశాడు కమల్. ఆ మాటకొస్తే.. ఫహద్‌పై చాలామందికి ఉన్న అభిప్రాయం ఇదే. బట్టతల, ఐదున్నర అడుగులు, గడ్డం, బక్కపల్చని రూపం, పొడి పొడిగా మాట్లాడే ఫహద్.. నటనకొచ్చేసరికి విశ్వరూపం చూపిస్తుంటాడు. అందుకేనేమో సౌత్ నార్త్ ఆడియొన్స్ మొత్తం అతన్ని ఇష్టపడుతుంటే.. ఆ క్రేజ్‌ను వాడుకునేందుకు అన్ని భాషలూ అతన్ని అక్కున చేర్చుకుంటున్నాయి.
నటుడు ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు ప్రత్యేకం.. ఇవాళ ఫహద్ 39 పుట్టినరోజు.. 1982 ఆగష్టు 8న అలపుజ్జాలో జన్మించాడు అబ్దుల్ హమీద్ మహమ్మద్ ఫహద్ ఫాజిల్.
పెద్ద దిక్కులేని కుటుంబానికి షమ్మీనే దిక్కు. బావ మంచోడని అనుకుని తన ప్రేమ విషయం చెప్తే.. ఆ ‘చెత్త’ కుటుంబంలోకి మరదల్ని పంపడం ఇష్టంలేని షమ్మీ తన సైకోయిజం చూపించి అందరినీ హడలకొట్టిస్తాడు. ఈ ఒక్క ‘కుంబళంగి నైట్స్’లోనే కాదు.. చాలా సినిమాల్లో ఫహద్ సైకిక్ క్యారెక్టరైజేషన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది కూడా. కేవలం కళ్లతోనే అతను పలికే హవభావాలు కట్టిపడేస్తుంటాయి. ప్రేయసిని నమ్మించి మోసం చేసే పాత్ర అయితేనేం, తన్నులు తిన్న ప్రతీకారంతో.. తిరిగి తంతేగానీ చెప్పులేసుకోనని ప్రతిజ్ఞ చేసే అమాయకుడైతేనేం, ప్రేమభగ్నమైన తర్వాత భర్త, దొంగ, సైకో, మానసిక రోగి, గ్యాంగ్‌స్టర్.. ఇలా పాత్రకు తగ వేరియేషన్స్‌ను అలవోకగా ప్రదర్శించడం ఫహద్‌కు నటనతో పెట్టిన విద్య. ‘టేకాఫ్’, ఎన్‌జన్ ప్రకాశన్, వారాతన్ లాంటి కమర్షియల్ హిట్స్ మాత్రమే కాదు.. ఈమధ్యకాలంలో ‘ట్రాన్స్’, ‘సీయూసూన్’, ‘జోజి’ ‘మాలిక్’.. ఇలా వరుస ప్రయోగాత్మక సినిమాలతో ఇండియన్ వ్యూయర్స్‌కు దగ్గరైన ఫహద్ ఫాజిల్‌ను.. విలక్షణ నటుడు అనడం కంటే అసాధారణమైన నటుడు అనడం కరెక్ట్.
కుంబళంగి నైట్స్‌లో షమ్మీగా
పనికిరాడన్నారు! అవమానంతో..
ఫహద్‌ది స్టార్ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ. తండ్రి ఫాజిల్ పెద్ద డైరెక్టర్ కావడంతో హీరో అయ్యేందుకు ఉవ్విళ్లూరాడు. డిగ్రీ చదివే టైంలో 19 ఏళ్లకే ముఖానికి మేకప్ వేసుకున్నాడు ఫహద్. 2002లో తొలి చిత్రం ‘కైయేథుమ్ దురత్’ రిలీజ్ అయ్యింది. తండ్రి డైరెక్షన్, లవ్ స్టోరీ, పైగా మమ్మూట్టి గెస్ట్ రోల్.. ఇంకేం సినిమా సూపర్ హిట్ అని అంతా అనుకున్నారు. కానీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడగా.. ఫాజిల్ నటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వెంట్రిలాక్విజం బొమ్మలా ఉన్నాడని.. ఏ కోణంలోనూ అతను హీరోగా పనికి రాడంటూ క్రిటిక్స్ ఏకీపడేశారు.
తొలి సినిమా పోస్టర్
ఆ సినిమా దర్శకుడు ఫాజిల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇందులో తన తండ్రి అంచనాలు తప్పలేవని, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా వచ్చి ఆ అంచనాలు తానే అందుకోలేకపోయానని నిజాయితీగా ఒప్పేసుకున్నాడు ఫహద్. ఆపై యాక్టింగ్‌ను వదిలేసి.. అమెరికాకు వెళ్లిపోయాడు. అక్కడే ఐదేళ్ల పాటు ఏంఎ ఫిలాసఫీ చేశాడు.
కమ్‌బ్యాక్..
ఘోరమైన అవమానం-విమర్శల తర్వాత యూఎస్ వెళ్లిపోయిన ఫహద్.. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. తండ్రి ప్రొత్సాహంతో ఈసారి దర్శకుడు రంజిత్ డైరెక్షన్‌లో ‘కేరళ కేఫ్’(2009)తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి నటుడిగా ఫహద్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చప్పా ఖురిష్(మలయాళం సినిమాల్లో సుదీర్ఘ కిస్ సీన్ ఉంది ఈ మూవీలోనే), డైమండ్ నెక్లెస్, 22 ఫిమేల్ కొట్టాయం, అన్నయుమ్ రసూలుమ్, బెంగళూరు డేస్, మహేషింటే ప్రతీకారం.. ఇలా వరుస హిట్లు నటుడిగా ఫహద్‌ను ఎస్టాబ్లిష్ చేశాయి. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోయింది ఫహద్ సినీ కెరీర్. ఒకానొక స్టేజ్‌కి వచ్చేసరికి మాలీవుడ్‌లో టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోల జాబితాలోకి చేరిపోయాడు ఫహద్.
తొండిముథలం ద్రిక్‌సాక్షియుంలో సూరజ్ వెంజరమూడుతో ఫహద్.. గొలుసు మింగేసి ఆపై ఇక్కట్లు పడే దొంగగా ఫహద్ నటన బాగుంటుంది.
ప్రత్యేకించి మలయాళ సినీ పరిశ్రమకు ప్రయోగాలకు, కొత్త జానర్లను, కొత్త సాంకేతికతను పరిచయం చేసిన నటుడిగా ఫహద్ పేరు ముద్రపడిపోయింది. ఇక తొండిముథలం ద్రిక్‌సాక్షియుం(2017) ఏకంగా నేషనల్ అవార్డును(బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్) తెచ్చిపెట్టగా.. స్టేట్, సౌత్ అవార్డులను సైతం అందుకున్నాడు. కరోనా తర్వాత వరుస ఓటీటీ రిలీజ్‌లతో సౌత్ ఆడియొన్స్‌కు బాగా దగ్గరయ్యాడు ఫహద్. నిర్మాతగానూ సూపర్ హిట్లు అందుకుంటున్నాడు ఫహద్. ఇక తమిళంలో శివకార్తీకేయన్ ‘వెళ్లైక్కారన్’తో డెబ్యూ ఇచ్చిన ఫహద్.. ఆపై సూపర్ డీలక్స్‌తో అలరించగా, కమల్ హాసన్ ‘విక్రమ్’తో మరోసారి సందడి చేయనున్నాడు. తెలుగుకొచ్చేసరికి అల్లుఅర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప’ ఆయన డెబ్యూ మూవీ కానుంది.
జోజిలో ఫహద్
మహేషింటే ప్రతీకారం(దీని రీమేకే సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
ఆండ్రియాతో ఎఫైర్.. నజ్రియాతో పెళ్లి
వివాదాలకు దూరంగా ఉండే ఫహద్.. వ్యక్తిగత జీవితంతో మాత్రం ఓసారి వార్తల్లో నిలిచాడు. కోలీవుడ్ సింగర్ కమ్ నటి ఆండ్రియాతో ఎఫైర్ ఉందంటూ 2013లో ఓ మ్యాగజీన్ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా ప్రకటించి వివాదంలో ఇరుక్కున్నాడు ఫహద్. అయితే అలాంటిదేం లేదని, ఫహద్ పేరు కోసం అలాంటి ప్రకటన చేసి ఉంటాడని ఆండ్రియా ఖండించింది. కానీ, తమ మధ్య ప్రేమాయణం నడించిందని, బ్రేకప్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టొచ్చంటూ ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఫహద్. ఈ వివాదంలో ఆండ్రియా పరువు నష్టం దావాకు సిద్ధపడగా.. ఫహద్ క్షమాపణలు చెప్పినట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి కూడా.
ట్రాన్స్ మూవీలో భార్య నజ్రియాతో ఫహద్
ఇది జరిగిన మరుసటి ఏడాదే.. మాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న నజ్రియా నజీమ్(26)ను వివాహం చేసుకున్నాడు ఫహద్. అయితే ఈ జంట మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉండడంతో అక్కడి మీడియాలోనూ ఇదో పెద్ద చర్చగా నడిచింది అప్పట్లో.
Comments
Please login to add a commentAdd a comment