హీరోయిన్స్ అంటే...? ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేవాళ్లు. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టుకునేవాళ్లు. పాటల వరకూ కనిపించి వెళ్లిపోయేవాళ్లు. హీరోయిన్‌ల పాత్రల డిజైన్‌లో మనకు తరచూ వినిపించే కామెంట్స్ ఇవి. హీరోయిన్‌కి స్ట్రాంగ్ రోల్స్‌తో వస్తున్న సినిమాలు తక్కువే. మెల్లిగా ఈ ధోరణి మారుతున్నట్టు కనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల ఆదరణ పెరుగుతోంది. హీరోయిన్లు పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు. నెగటివ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్నారు. సీత మంచి అమ్మాయి అనే పాత్రలే కాకుండా నెగటివ్ సైడ్‌ని ఆవిష్కరించి భలేడీ విలన్లు అనిపించు కుంటున్నారు.
విలన్ – నయన్
హిందీ చిత్రం ‘అంధాధూన్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఇందులో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రకు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ‘అంధాధూన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. టబు పోషించిన పాత్రకు నయనతారను సంప్రదించినట్టు సమాచారం. నయన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయానికి వస్తే.. తనకు ఇబ్బందిగా అనిపిస్తే చంపేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. సినిమా కథకు కీలకమైన పాత్ర ఇది.
నయనతార
టెర్రరిస్ట్ స్యామ్
సమంత తన కెరీర్‌లో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కమర్షియల్ సక్సెస్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’తో మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా వెబ్‌స్పేస్‌లోకి అడుగుపెడుతున్నారు స్యామ్. వెబ్ ఎంట్రీ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ రెండో పార్ట్‌లో సమంత కూడా జాయిన్ అయ్యారు. ఇందులో సమంత నెగటివ్ పాత్రలో నటించారు. టెర్రరిస్ట్‌గా కనిపిస్తారని సమాచారం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రసారం కానుంది.
సమంత
కనులతో దోచారు
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఫిబ్రవరిలో విడుదలయిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఇందులో రీతూ అమాయకంగా కనిపించే దొంగ పాత్ర చేశారు. తెలివిగా ప్లాన్ చేసి మోసాలు చేశారు. ‘పెళ్లి చూపులు’తో ఒకలాంటి ఇమేజ్ ని సంపాదించుకొని ఇలాంటి పాత్ర చేయడంలో రీతు విభిన్నత కనిపిస్తుంది. ‘కనులు కనులను..’ చిత్రంతో తాను నెగటివ్ క్యారెక్టర్స్ చేయగలనని నిరూపించుకున్నారు రీతూ వర్మ.
‘కనులు కనులు దోచాయంటే’లో రీతూ వర్మ
సీతతో వీజీ కాదు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకుడు. ఈ సినిమాలో కాజల్ పాత్రలో కొంచెం నెగటివ్ యాంగిల్ ఉంది. తనది పక్కా ప్రాక్టికల్ బిజినెస్ ఉమెన్ పాత్ర. డబ్బు కోసం తెలివితేటలతో మోసం చేయడం తప్పు కాదని నమ్మే పాత్ర తనది. అందులో పెద్ద తప్పు కూడా లేదనుకుంటుంది ఆ పాత్ర. అప్పటివరకూ పాజిటివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన కాజల్ ‘సీత’లో అందుకు భిన్నంగా కనిపించి, ప్రసంశలు దక్కించుకోగలిగారు.
‘సీత’లో కాజల్ అగర్వాల్
బోల్డ్ ఎంట్రీ
తొలిసారి తెరపై కనబడినప్పుడే ప్రేక్షకుల ప్రేమను పొందాలనుకుంటారు ఎవరైనా. కానీ పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్ 10’లో భిన్నమైన పాత్ర ఎంచుకున్నారు. ఈ సినిమాలో కొంచెం హాట్‌గా కనిపించారు. అలాగే సినిమాలో ఆమెది విలన్ పాత్ర. స్వార్థం కోసం ప్రేమించి మోసం చేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. మామూలుగా పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం కష్టం అంటారు. ఆ విధంగా తొలి సినిమాతోనే పాయల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
‘ఆర్‌ఎక్స్ 100’లో పాయల్
నల్ల విలన్
తమిళ నటి వరలక్ష్మి హీరోయిన్‌గా, లేడీ విలన్‌గా తమిళ సినిమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ‘నల్ల’ విలన్ (మంచి విలన్) అని పేరు తెచ్చుకున్నారు కూడా.. ఆ మధ్య ‘సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకష్ణ’ చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు. ‘సర్కార్, తెనాలి రామకృష్ణ’ సినిమాల్లో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా ఆమె వేసిన ఎత్తులకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’లోను పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు వరలక్ష్మి. వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ‘భలే’డీ విలన్ అనిపించుకుంటున్నారు వరలక్ష్మి.
‘పందెం కోడి 2’లో వరలక్ష్మీ
మహా విలన్ అనిపించుకోవాలని...
హీరోయిన్‌గా 49 సినిమాలు పూర్తి చేశారు హన్సిక. 50వ సినిమా మైలురాయి గుర్తుండిపోయేలా ఉండాలని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ‘మహా’ అనే చిత్రం చేస్తున్నారామె. ఇందులో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ‘హన్సిక మహా విలన్’ అని అందరితో అనిపించుకోవాలనే పట్టుదలతో నటనపరంగా చాలా కేర్ తీసుకున్నారట ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
‘మహా’లో హన్సిక
‘పాటల కోసం హీరోయిన్’ అనే గ్లామరస్ క్యారెక్టర్స్ కే పరిమితం కాకుండా వీలు కుదిరినప్పుడల్లా విలన్ పాత్రల్లో భ‘లేడీ విలన్లు’ అనిపించుకుంటున్న నాయికలను అభినందించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment