టైటిల్: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, హైపర్ ఆది తదితరులు
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకుడు: కృష్ణ చైతన్య
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి
విడుదల తేది: మే 31, 2024
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్ అలియాస్ రత్న(విశ్వక్ సేన్) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు.
ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
విలేజ్ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది.
అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు.
హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
రత్న అలియాస్ రత్నాకర్ పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్‌ఫుల్ పాత్రలో అంజలి చక్కగా నటించింది.
బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్ సాంగ్‌లో ఆయేషా ఖాన్ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్, సాయి కుమార్ హైపర్ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment