కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన తాజా చిత్రం 'ది గోట్'. తమిళ స్టార్, దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ సంఘటనను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. అదేంటో తెలుసుకుందాం.
గోట్ మూవీలో ఓ పాటకు ట్యూన్ పూర్తయ్యాక ఓ విషాద వార్త వినాల్సి వచ్చిందని వెంకట్ ప్రభు తెలిపారు. ఆ సాంగ్‌కు సింగర్ భవతారిణితో పాడించాలని అనుకున్నట్లు వెల్లడించారు. కానీ ఊహించని విధంగా ఆమె మరణవార్త వినాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె సోదరుడు యువన్ శంకర్ రాజా ఈ పాటను కంపోజ్ చేశారని.. తాను ట్యూన్ కంపోజ్ చేసిన రోజే భవతారిణి చనిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆమెతోనే ఈ పాటను పాడించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఏఐ సాయంతో వాయిస్..
ఎలాగైనా సరే భవతారిణి వాయిస్‌తోనే ఆ పాటను పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని వెంకట్ ప్రభు అన్నారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో ఎలా చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించామని తెలిపారు. గతంలో ఏఆర్ రెహమాన్ తన పాట కోసం షాహుల్ హమీద్ వాయిస్‌ని ఎలా ఉపయోగించాడో.. అలాగే మనం కూడా చేద్దామని యువన్ శంకర్ రాజాకు చెప్పానని వెల్లడించారు. ఆ తర్వాత వారిని సంప్రదించి సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేశారని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో చిన్న చిన్న కనగల్ పాటకు ఆమె వాయిస్‌ను జోడించామని వెంకట్ తెలిపారు. భవతారిణి వాయిస్‌ని రీక్రియేట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించిన విధానాన్ని ఆయన వివరించారు. ఈ సాంగ్ మేల్ వాయిస్‌ను హీరో విజయ్ పాడారని.. మా సినిమాలో విజయ్ రెండు పాటలు పాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
కాగా.. కోలీవుడ్‌లో సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇళయరాజా కూతురు భవతారిణి జనవరి 25న శ్రీలంకలో క్యాన్సర్‌తో మరణించారు. ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు. భారతి చిత్రంలోని 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు భవతారిణి ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment