ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్‌లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దీపావళి వెలుగులతో మెరవనుంది. యాక్షన్ టపాసులు, ప్రేమ కాకరపువ్వొత్తులు, నవ్వుల చిచ్చుబుడ్డులు ఆడియన్స్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక పండగ సందర్భంగా వస్తున్న సినిమాల వివరాల్లోకి ఓసారి వెళదాం.
దీపావళికి యాక్షన్ ‘జిన్నా’గా వస్తున్నారు మంచు విష్ణు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ టెంట్ హౌస్‌ను రన్ చేసే జిన్నా అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. తన వాళ్ల కోసం జిన్నా ఎలాంటి రిస్క్‌లు తీసుకున్నాడు? ఎవరి రాక కారణంగా జిన్నా లైఫ్ టర్న్ అయ్యింది? అనేది సినిమా కథ. డా. మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది.
మరోవైపు ‘ఓరి దేవుడా..!’ అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేశ్ నటించారు. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగుకి పరిచయమవుతున్న చిత్రం ఇది. ‘వైఫ్‌లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందా..!’ అనే డైలాగ్ ‘ఓరి దేవుడా..!’ ట్రైలర్‌లో ఉంది. సో.. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ యువకుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది.
ఇక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ ‘సర్దార్’గా రానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా రాశీ ఖన్నా చేయగా, కీలక పాత్రలో లైలా నటించారు. ఓ గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో ‘సర్దార్’ సాగుతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
‘జిన్నా’, ఓరి దేవుడా..!’, ‘సర్దార్’ చిత్రాలు రిలీజ్ అవుతున్న రోజునే ‘ప్రిన్స్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకుడు. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్‌గా చేశారు. ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. సునీల్ నారంగ్, డి. సురేబాబు, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు దీపావళికి కన్ఫార్మ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు పండగ రేసులో నిలిచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment