
ఉగాది పండగని పురస్కరించుకుని పలు సినిమాల నుంచి పాటలు విడుదలయ్యాయి. ఆ పాటల సందడి విశేషాలు చూద్దాం..
⇔ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ సినిమా నుంచి ‘డిక్కా డిష్యూం..’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి యూకే, భీమ్స్, నరేష్ మామిండ్ల ఆలపించారు.
⇔ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేష్ జంటగా నటించిన ‘దసరా’ ఈ నెల 30న రిలీజ్ కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ స్వరపరచిన ‘ధూం ధాం దోస్తాన్..’ అనే వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాలమూరు జంగిరెడ్డి, నర్సన్న, కాసర్ల శ్యామ్ పాడారు.
⇔ అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేష్ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ‘పుత్తడి బొమ్మ కోవెల కొమ్మ..’ అనే తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రధన్ సంగీతం అందించిన ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా, ఎమ్‌ఎమ్ మానసి పాడారు.
⇔ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. కదిరేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత ‘ఠాగూర్’ మధు తెలుగులో ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘భగ భగ రగలరా..’ పాటని రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటని పృథ్వీ చంద్ర పాడారు.
⇔ యోగేశ్వర్, అతిథి జంటగా సాయి శివాజీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరారి’. గాలి ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా ఈ 30న రిలీజవుతోంది. ఈ చిత్రం కోసం మహిత్ నారాయణ్ స్వరాలు సమకూర్చి, రాసిన ‘ఏమో ఏమో..’ పాటని నటి విజయశాంతి రిలీజ్ చేశారు. ఈ పాటను సాయి చరణ్, సురభి శ్రావణి పాడారు.
Comments
Please login to add a commentAdd a comment