టైటిల్: రావణాసుర
నటీనటులు: రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేశ్, సంపత్ రాజ్ తదితరులు
నిర్మాణ సంస్థ:అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్
నిర్మాతలు : అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా
దర్శకత్వం: సుధీర్ వర్మ
సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ కన్నన్
ఎడిటర్ : శ్రీకాంత్
విడుదల తేది: ఏప్రిల్ 7, 2023
మాస్ మహారాజా రవితేజ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధమాకా’తో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రవితేజను ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేర్చింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’తో ఓ భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రావణాసుర’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘రావణాసుర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
రవీంద్ర అలియాస్ రవి(రవితేజ) ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ కనకమహాలక్ష్మీ(ఫరియా అబ్దుల్లా)దగ్గర పనిచేస్తుంటాడు. ఓ పెద్ద ఫార్మా కంపెనీ సీఈఓ హారిక(మేఘ ఆకాశ్) తన తండ్రి విజయ్ తల్వార్(సంపత్‌రాజ్) ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని, ఆ కేసుని టేకాప్ చేయమని కనకమహాలక్ష్మీ దగ్గరకు వస్తుంది. రవీంద్ర బలవంతం చేయడంతో కనకమహాలక్ష్మీ ఆ కేసును టేకాప్ చేస్తుంది. అయితే ఆ మర్డన్ తాను చేయలేదని విజయ్ తల్వార్ చెబుతాడు.
ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే.. నగరంలో అదే తరహా హత్యలు జరుగుతుంటాయి. చనిపోయినవారంతా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కావడంతో.. ఏసీపీ హన‍్మంతరావు(జయరామ్) ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారిస్తాడు. ఈ క్రమంలో సాకేత్(సుశాంత్) గురించి తెలుస్తుంది. అలాగే ఈ హత్యలకు క్రిమినల్ లాయర్ రవీంద్రకు సంబంధం ఉందని గుర్తిస్తారు. అసలు సాకేత్ ఎవరు? వరుస హత్యల వెనుక ఉన్నదెవరు? ఈ హత్యలకు క్రిమినల్ లాయర్ రవీంద్రకు ఉన్న సంబంధం ఏంటి? హోంమంత్రి ముదిరెడ్డి(రావు రమేశ్)ని హత్య చేయాలని కుట్ర చేసిందెవరు? ఏ ప్రయోజనాల కోసం ఈ హత్యలు జరిగాయి? తనపై వచ్చిన ఆరోపణల నుంచి రవీంద్ర ఎలా తప్పించుకున్నాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్’ ఓ సందర్భంలో హీరో గురించి పోలీసు అధికారి చెప్పే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్ చాలు ‘రావణాసుర’ కథ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వరుస హత్యలు.. దాని వెనక హీరో ఉన్నాడని గుర్తించడం..‘లా’లోని లాజిక్కులను వాడుకొని ఆ హీరో ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేయడం.. ఇదే రావణాసుర కథ. అయితే ఆ హత్యలు ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ క్యూరియాసిటీని ఫస్టాఫ్ మొత్తం కొనసాగించాడు డైరెక్టర్. కానీ సెకండాఫ్‌లో రీజన్ ఏంటో తెలిశాక..ఇప్పటికే ఈ తరహా కథలను చాలా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది.
ఫస్టాఫ్‌లో థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నప్పటికీ కథనం ఆసక్తిగా సాగదు. హైపర్ ఆదితో రవితేజ వేసే పంచ్‌లు, లవ్‌ట్రాక్ అన్ని రొటీన్‌గా అనిపిస్తాయి. సుశాంత్ పాత్ర ఎంట్రీ తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అయితే రవితేజ అద్భుతమైన నటన కారణంగా ఫస్టాఫ్ బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెంకడాఫ్‌లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నారు. ఊహకందేలా కథనం సాగడం.. ట్వీస్టులు కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ‘రావణాసుర’కి పెద్ద మైనస్. అయితే థ్రిల్లర్ సినిమాలు అంతగా చూడలి వారికి మాత్రం ఆ ట్విస్టులు అలరిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
మాస్ మహారాజా ఎనర్జీ గురించి అందరికి తెలిసిందే. కామెడీ అయినా.. యాక్షన్ అయినా ఇరగదీస్తాడు. ఇందులో కొత్తగా తనలోని విలనిజాన్ని చూపించాడు. రెండు విభిన్నమైన కోణాలు ఉన్న రవీంద్ర పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీన్ అయితే అదుర్స్. ఫస్టాఫ్‌లో తనదైన కామెడీతో నవ్వించాడు. సినిమాకు ప్రధాన బలం ఆయన నటన అనే చెప్పొచ్చు.
ఇక ఇందులో ఫరియా, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించినా.. ఏ ఒక్కరికి సరైన ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో ఫరియా, మేఘ ఆకాశ్ పాత్రలు మెప్పిస్తాయి. ఇక అను ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి అయితే మరీ తక్కువ. ఏసీపీ హన్మంతరావుగా జయరాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్‌తో కామెడీ పండించాడు. హోంమంత్రిగా రావు రమేశ్ కేవలం రెండు, మూడు సీన్లకే పరిమితమయ్యారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్దన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన 'డిక్కా డిష్యూం' పాట బాగుంది. రీమేక్ సాంగ్‌తో సహా మిగతా పాటలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పని తీరు బాగుంది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా న్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment