‘‘ఓటీటీల్లో సినిమాను విడుదల చేయడం అనేది ఆయా నిర్మాతల పరిస్థితిని బట్టి ఉంటుంది. సినిమా కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుంటే వారు మాత్రం ఏం చేస్తారు? ఓటీటీ అనేది ఒక అడ్వాంటేజ్. భవిష్యత్‌లో ఓటీటీకి ఇంకా మంచి ఆదరణ ఉంటుంది. అయితే థియేటర్స్ అనేవి జీవితాంతం ఉంటాయి’’ అని గోపీచంద్ అన్నారు. ‘గౌతమ్ నంద’ చిత్రం తర్వాత హీరో గోపీచంద్– డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సీటీమార్’. తమన్నా హీరోయిన్‌గా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతున్న సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు...
► ‘గౌతమ్ నంద’ చిత్రం మేం అనుకున్నంత ప్రేక్షకాదరణ పొందలేదు. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఆ సమయంలోనే సంపత్ నందితో మరో సినిమా చేస్తానని చెప్పాను. ‘సీటీమార్’ కథకంటే ముందు విద్యా వ్యవస్థ నేపథ్యంలో సంపత్ ఓ కథ చెప్పాడు. అయితే ఇప్పుడప్పుడే సందేశాత్మక చిత్రం వద్దని, వేరే కథతో చేద్దామని చెప్పాను. ఆ తర్వాత ‘సీటీమార్’ కథ రాసుకొచ్చాడు.. బాగా నచ్చడంతో చేశాను.
► తెలుగులో పురుషుల కబడ్డీ నేపథ్యంలో గతంలో ‘భీమిలీ కబడ్డీ జట్టు, కబడ్డీ కబడ్డీ’ వంటి చిత్రాలు వచ్చాయి. అయితే మా సినిమా మహిళా కబడ్డీ నేపథ్యంలో ఉంటుంది. స్పోర్ట్స్ ఫిల్మ్‌కి కమర్షియల్ అంశాలు యాడ్ చేశాం. సిస్టర్ సెంటి మెంట్, భావోద్వేగాలతో కూడిన సీన్స్ కూడా ఉన్నాయి.
► ‘సీటీమార్’ కథ నాకు కొత్తగా అనిపించింది. పైగా స్పోర్ట్స్ నేపథ్యంలో నేను ఇప్పటివరకూ సినిమా చేయలేదు. ఈ సినిమాలోని కబడ్డీ జట్టులో నటించిన 12 మందిలో నలుగురు నిజమైన కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. వారు జాతీయ స్థాయికి రావడానికి పడిన కష్టం, అనుభవాలు చెబుతుంటే పాపం అనిపించింది. జట్టులోని మిగిలిన 8 మందికి 3 నెలలు కబడ్డీలో శిక్షణ ఇచ్చారు.. ప్రాక్టీస్‌లో మోకాళ్లకు దెబ్బలు తగిలినా అంకితభావంతో చేశారు.
► ఈ చిత్రంలో కోచ్‌లకి ఓ గోల్ ఉంటుంది. తన జట్టు ద్వారా ఆ గోల్‌ని ఎలా రీచ్ అయ్యారన్నదే ‘సీటీమార్’ కథ. 2019 డిసెంబరులో ‘సీటీమార్’ చిత్రం ప్రారంభమైంది. 2020 వేసవిలో విడుదల చేద్దామనుకున్నాం. కరోనా మొదటి విడత లాక్‌డౌన్ వచ్చింది. ఆ తర్వాత 2021 ఏప్రిల్ రిలీజ్‌కి ప్లాన్ చేశాం.. కానీ ఇప్పటికి కుదిరింది. మా చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. అయితే ఇలాంటి సినిమాని థియేటర్స్‌లో చూస్తే బాగుంటుందనే ఓటీటీకి వెళ్లలేదు. ప్రేక్షకులు కూడా ప్రస్తుతం థియేటర్లకు బాగానే వస్తున్నారు.
► మణిశర్మగారితో నేను 7 సినిమాలు చేస్తే వాటిల్లో 6 హిట్స్ ఉన్నాయి. ‘సీటీమార్’కి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారాయన. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాను. అలాగే శ్రీవాస్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాను.
Comments
Please login to add a commentAdd a comment