
‘‘కోర్ట్’ కథ నానిగారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాణంలో ఏది కావాలన్నా ఏర్పాటు చేయమని నిర్మాతలు దీప్తి, ప్రశాంతిగార్లకు చెప్పారు. వారిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. దీప్తిగారు సెట్స్‌లో ఉండేవారు. నానిగారు మాత్రం అప్పుడప్పుడు మా సినిమా రషెస్ చూసి ఏౖవైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారు’’ అని ప్రియదర్శి తెలిపారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోర్ట్’.
నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ–‘‘2022లో నేను, రామ్ జగదీష్ ‘కోర్ట్’ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో లాయర్ పాత్రని ఓ పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుందనుకున్నాడు జగదీష్. కానీ, నేనే చేస్తానని చెప్పడంతో సరే అన్నాడు. పోక్సో కేసు అంటే ఏంటి? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అని చాలా పరిశోధన చేసి, ఈ మూవీ తీశాడు జగదీష్.
ఈ చిత్రంలో నేను లాయర్ పాత్ర చేశాక వారిపై నాకు గౌరవం పెరిగింది. ‘కోర్ట్’ సినిమాపై ఉన్న నమ్మకంతోనే ‘ఈ చిత్రం నచ్చకపోతే నా ‘హిట్ 3’ చూడొద్దు’ అని నానిగారు చెప్పారు. నా లాంటి నటులు మంచి కథలు చేస్తేనే జనాలు థియేటర్స్‌కి వస్తారు.. లేదంటే రారు. ఏ సినిమా అయినా మంచి వసూళ్లు సాధిస్తే అది కమర్షియల్ హిట్టే.
అలా ‘కోర్ట్’కి మంచి వసూళ్లు వస్తే నేను కమర్షియల్ హీరోనే(నవ్వుతూ). శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కేఐ వరప్రసాద్‌గారి బయోపిక్ చేయాలని ఉంది. నేను నటించిన ‘సారంగపాణి జాతకం’ మూవీ ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ‘ప్రేమంటే..’ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment