వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్‌ హీరోలు | Suriya, Nikhil Siddharth And Mohanlal Are Ready To Fight On The Silver Screen With These Movies - Sakshi
Sakshi News home page

వెండితెరపై యుద్ధానికి సిద్ధం అవుతున్న స్టార్‌ హీరోలు

Published Thu, Sep 14 2023 12:48 AM | Last Updated on Thu, Sep 14 2023 11:09 AM

Heroes are ready to fight on the silver screen - Sakshi

వెండితెరపై కథానాయకుడు కత్తి దూస్తే.. గుర్రపు స్వారీ చేస్తూ యుద్ధం చేస్తే... విల్లు ఎక్కుపెడితే చూసే ప్రేక్షకులకు ఓ థ్రిల్‌. రెగ్యులర్‌గా వచ్చే ఫైట్స్‌కి భిన్నంగా సిల్వర్‌ స్క్రీన్‌పై ‘వార్‌’ కనిపిస్తే ‘వావ్‌’ అనకుండా ఉండలేరు. కొందరు హీరోలు వెండితెరపై యుద్ధం చేయడానికి రెడీ అయ్యారు. ఆ వారియర్స్‌ గురించి ఓ లుక్‌ వేయండి.

దిక్కులెల్ల గెలిచినోడు..
‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులెల్ల గెలిచినోడు.. ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’.. కంగువా’ సినిమాలో హీరోగా సూర్య పాత్రను చిత్రబృందం వివరించిన తీరు ఇది. దీన్నిబట్టి ఈ సినిమాలో సూర్య పాత్రను ఈ చిత్రదర్శకుడు శివ చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్ది ఉంటారని ఊహించవచ్చు. ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు సూర్య.

ఇప్పటికే ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అంతేకాదు..‘కంగువా’ సినిమాలో ఈ సీన్స్‌ హైలైట్‌గా ఉంటాయని కోలీవుడ్‌ సమాచారం. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్‌ అయ్యే ఓ పాయింట్‌తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటించారు. ‘కంగువా’ తొలి భాగం ఏప్రిల్‌లో విడుదల కానుంది.

ది వారియర్‌
విభిన్న సినిమాలు, వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉంటారు హీరో మోహన్‌లాల్‌. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్‌ అరైజ్‌’ అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. తొలి షెడ్యూల్‌  పూర్తయింది. కాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ లుక్‌ కొన్ని సీన్స్‌లో మోహన్‌లాల్‌ వారియర్‌గా కనిపిస్తారన్నట్లుగా స్పష్టం చేస్తోంది.

దీనికి తోడు క్యాప్షన్‌లో ‘వారియర్‌’ ప్రస్తావన ఉండటంతో మోహన్‌లాల్‌ వారియర్‌గా కనిపించే నిడివి కూడా ఎక్కువే అని ఊహిస్తున్నారు ఆయన అభిమానులు. తెలుగు, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రోషన్‌ ఓ హీరోగా నటిస్తున్నాడు. జహ్రా ఖాన్, శనయ కపూర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నందకిశోర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే మోహన్‌లాల్‌ నటించి, తొలిసారి దర్శకత్వం వహించిన పీరియాడికల్‌ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్‌ ‘బరోజ్‌’. ఈ చిత్రంలో ఓ నిధిని కాపాడే యోధుడిగా కనిపిస్తారాయన.  

స్వయంభూ
వియత్నాంలో మార్షల్‌ ఆర్ట్స్, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం.. వంటి యుద్ధ విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు హీరో నిఖిల్‌. ఎందుకంటే ‘స్వయంభూ’ సినిమా కోసం. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌లో నిఖిల్‌ యుద్ధ వీరుడిగా కనిపిస్తారు. నిఖిల్‌ శిక్షణ పూర్తయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ పూర్తి స్థాయిలో ్రపారంభం కానుంది. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇలా ‘వార్‌’ బ్యాక్‌డ్రాప్‌లో దక్షిణాదిన మరికొన్ని చిత్రాలు రూపొందుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement