
తమిళ సినిమా: నటి అంజలి 5 ఏళ్ల తర్వాత మాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చారు. పదహారణాల తెలుగు అమ్మాయి అయిన ఈమె ముందు తమిళంలో కథానాయకిగా రాణించి ఆ తర్వాత మాతృభాష తెలుగులో గుర్తింపు పొందారు. తమిళంలో ఎక్కువగా యువ హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం బాలకృష్ణ, వెంకటేష్ వంటి సీనియర్ హీరోల సరసన నటించారు. అదేవిధంగా ఐటెం సాంగ్స్‌లోనూ మెరిశారు. వెబ్ సిరీస్‌లూ చేస్తున్నారు.
తాజాగా శంకర్ దార్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా అంజలి తమిళం, తెలుగు భాషలోనే కాకుండా మలయాళం వంటి ఇతర భాషల్లోనూ నటిగా గుర్తింపు పొందారు. ఈమె 2010లో పైన్స్ అనే చిత్రం ద్వారా మాలీవుడ్‌లో పరిచయం అయ్యారు. ఆ తరువాత 2018లో రోసాపూ చిత్రంలో నటించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఎప్పుడు మూడోసారి రట్ట అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. జోసెఫ్ చిత్రం ఫేమ్ జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఇందులో నటి అంజలి కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దశలో ఉంది. అంజలి పాత్రతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు.