చాలా రోజుల తర్వాత థియేటర్ల వద్ద ‘హౌస్‌ఫుల్ బోర్డులు’ వెలిశాయంటే అది ‘జాతిరత్నాలు’ సినిమా వల్లే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీలో హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్న ఫరియా తన సంతోషాన్ని.. సక్సెస్‌ను సాక్షితో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
‘మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం. ప్రస్తుతం ఈ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్నా. సినిమా చేస్తున్నప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. తెలుగు సినిమాల్లో ఎప్పటికి గుర్తుండిపోయేలా తీసిన ‘మహానటి’ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ‘జాతిరత్నాలు’ సినిమాకి నిర్మాత కావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే ఈ సినిమాను ఒప్పుకున్నా. హైదరాబాద్ నగరంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో మరచిపోలేని అనుభూతులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి నా చదువంతా ఇక్కడే పూర్తిచేశా.
ప్రస్తుతం బయట కూడా అందరూ నన్ను చిట్టీ (సినిమాలోని పాత్రపేరు) అని పిలుస్తుంటే కొత్తగా ఉంది. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందించిన ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చా. మంచి ఆర్టిస్ట్‌గా నిలవాలనే ఆశయంతో నా ప్రయత్నాలను ఎప్పుడూ ఆపలేదు. ఇంతకు మందు థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా చేశాను. మొదటి నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. చాలా వాటిలో ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ‘హైదరాబాద్ డ్యాన్స్ ఫెస్టివల్’లో భాగంగా నిర్వహించే ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నాను. అల్లు అర్జున్ డ్యాన్స్‌లంటే ఎంతో ఇష్టం. జాతిరత్నాలు సక్సెస్‌తో నా బాధ్యత మరింత పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment