‘రిస్కీ ఫైట్ చేయాలా? డూప్ వద్దు.. చేసేస్తాం’ అని కొందరు హీరోయిన్లు యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలా ఈ మధ్య టబు, శిల్పా శెట్టి, సంయుక్తా హెగ్డే షూటింగ్‌లో గాయపడ్డారు. అయితే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కోలుకున్నాక డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తాం అంటున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఇటీవల వీరు చేసిన రిస్కీ యాక్షన్ గురించి తెలుసుకుందాం.
టబు పేరు గుర్తు రాగానే ‘కొత్త కొత్తగా ఉన్నది...’ అంటూ వెంకటేశ్‌తో ‘కూలీ నెం. 1’లో, ‘ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జునతో రొమాంటిక్‌గా ఆడిపాడిన పాటలు గుర్తొస్తాయి. అలాంటి క్యూట్ రోల్స్ చేసిన టబు వీలు కుదిరినప్పుడల్లా పవర్‌ఫుల్ రోల్స్ చేస్తుంటారు. తాజాగా ‘భోలా’ చిత్రంలో ఆమె పోలీసాధికారి పాత్ర చేస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ అన్నమాట. ఈ సినిమా కోసం ఇటీవల టబు పాల్గొనగా ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఓ మోటారు సైకిల్, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.
ట్రక్కు అద్దాలు పగలడంతో టబు నుదురు, కంటి దగ్గర గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం కాకపోవడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కానీ టబు కంటి దగ్గర గాయం కావడంతో అది తగ్గే వరకూ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కథానాయకుడు. ఇక టబు గాయపడిన ఒకట్రెండు రోజులకు మరో నటి శిల్పాశెట్టి ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం శిల్పా చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఒకటి. శిల్పాకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో శిల్పాది పోలీసాఫీసర్ క్యారెక్టర్. సో.. ఫైట్స్ ఉండటం సహజం.
‘ఒక యాక్షన్ సీన్ తీస్తూ.. యాక్షన్ అని చెప్పి, కాలు విరగ్గొట్టుకో అని నా యూనిట్ సభ్యులు అన్నారు. ఆ మాటలను సీరియస్‌గా తీసుకున్నాను. అంతే.. కాలికి బలమైన గాయం అయింది. ఫలితంగా ఆరు వారాలు షూటింగ్‌కి బ్రేక్. బలంగా తిరిగొస్తా.. ఫైట్ సీన్ చేస్తా’ అని పేర్కొన్నారు శిల్పా శెట్టి. మరోవైపు యువకథానాయిక సంయుక్తా హెగ్డే కూడా ఇటీవల షూటింగ్‌లో గాయపడ్డారు. ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘క్రీమ్’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారామె. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సంయుక్తాకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఈ సినిమాకి ఆమెను కథానాయికగా ఎంపిక చేయడానికి అదొక కారణం.
కాగా, ‘క్రీమ్’ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఫైట్ సీన్‌లో సంయుక్తా హెగ్డేకి బలమైన గాయం తగిలింది. కాలికి గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి సూచించారు. ‘‘ఇంటిపట్టున కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఈ రెండు నెలల్లో పాటలు పాడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గతంలో కొన్ని కథలు రాశాను. వాటికి స్క్రీన్‌ప్లే రాసే టైమ్ దొరకలేదు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలను కుంటున్నాను’’ అన్నారు సంయుక్తా.
కథానాయికలకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకు భిన్నంగా చాలెంజింగ్ రోల్స్ వస్తే, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. టబు, శిల్పా, సంయుక్తా ఇటీవల గాయపడిన తారలైతే గతంలో తాప్సీ, కంగనా రనౌత్ వంటి కథానాయికలు షూటింగ్స్‌లో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ సవాల్‌లాంటి క్యారెక్టర్ అంటే ‘సై’ అంటున్నారు. ‘ఆడపులులు’ అంతే మరి..
Comments
Please login to add a commentAdd a comment