నందినీ రెడ్డి, సురేశ్ బాబు, నాగచైతన్య, దుల్కర్ సల్మాన్, అదితీరావ్, బృందా మాస్టర్, జగపతి బాబు
‘‘హే సినామిక’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా వేడుకకి రావడం గౌరవంగా భావిస్తున్నా. బృందా మాస్టర్ కొరియోగ్రఫీకి నేను పెద్ద ఫ్యాన్. మీరు సినిమాలను డైరెక్ట్ చేయండి.. కానీ కొరియోగ్రఫీ మాత్రం వదలొద్దు.. ప్లీజ్’’ అని హీరో నాగచైతన్య అన్నారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీరావ్ హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా మాస్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హే సినామిక’. జియో, గ్లోబల్ వన్, వయాకామ్ 18 స్టూడియోస్‌పై నిర్మించిన ఈ సినిమా రేపు(గురువారం) రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘బృందా మాస్టర్‌గారు సినిమాని డైరెక్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ‘మనం’ సినిమాలోని ‘కనులను తాకే..’ అనే మాంటేజ్ పాటకు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారామె. చెన్నైలో ఉన్నప్పటి నుంచే నాకు, దుల్కర్‌కి పరిచయం ఉంది. తను ప్రతి భాషలోనూ సినిమాలు చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ–‘‘హే సినామిక’ నాకు చాలా ప్రత్యేకం. పాటల్లో రొమాన్స్, ఎమోషన్స్ ఎలా చేయాలో నాతో బాగా చేయించేవారు బృందామాస్టర్. ఆమె నాకు తల్లిలాంటిది. ‘హే సినామిక’ చూసి నవ్వుతారు, ఏడుస్తారు, డాన్స్ చేస్తారు’’ అన్నారు. ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో నేను డాన్స్ మాస్టర్‌గా ఉన్నానంటే కారణం నిర్మాతలు రామానాయుడుగారు, సురేశ్‌బాబుగారే. ‘హే సినామికా’ దర్శకురాలిగా నా తొలి చిత్రమైనా దుల్కర్ ఓకే చెప్పడం హ్యాపీ’’ అన్నారు బృందామాస్టర్. ‘‘హే సినామిక’ చూసి మీరందరూ తప్పకుండా నవ్వుతారు’’ అన్నారు అదితీరావ్ హైదరీ. నిర్మాత డి.సురేశ్ బాబు మాట్లాడుతూ–‘‘డాన్స్ మాస్టర్‌గా బృందాని చాలా రోజులుగా చూస్తున్నా. ఆమె సినిమాని డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘హే సినామికా’ బాగా ఆడాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘నా డాన్స్‌లో గురు బృందామాస్టర్. నాతో డాన్స్ చేయించేందుకు ఆమె ఎంత కష్టపడిందంటే.. ఆమె కెరీర్‌లో చాలా కష్టమైన హీరో నేనే అయ్యుంటాను.. అందుకే నేను హీరోగా మానేశాను కూడా(నవ్వుతూ)’’ అన్నారు నటుడు జగపతిబాబు. ‘‘బృంద కొరియోగ్రఫీ చేస్తున్నారంటే మణిరత్నంలాంటి డైరెక్టర్ కూడా సెట్స్‌లో ఉండరు.. ఆమె ప్రతిభపై అంత నమ్మకం. ‘హే సినామిక’ ద్వారా విజువల్ ట్రీట్ ఇస్తున్నారామె’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment